http://apvarthalu.com/

Saturday, September 8, 2012

కార్మికుల ప్రాణాలంటే లెక్కలేదా?


                     
ప్రభుత్వ నిర్లక్ష్యం, యాజమాన్యాల అక్రమాలు, అధికారుల అవినీతి పెనవేసుకుపోయి పరిశ్రమల్లో ప్రమాదాలను ఆనవాయితీగా మార్చేశాయి. స్వాతంత్య్రదినం రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో స్టీమ్‌కోర్‌ అలైస్‌లో సంభవించిన ఘోర ప్రమాదం యావత్‌ రాష్ట్రాన్ని, కార్మిక లోకాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో సలసల కాగుతున్న ఇనుప ద్రవం ఒంటి మీద పడి ముగ్గురు కార్మికులు ప్రాణాలు వదిలారు. మరో పది మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అదే రోజు హైదరాబాద్‌ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారత్‌ ఫ్లెక్సోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఎన్‌పి కెమికల్స్‌, కార్మోల్‌ డ్రగ్స్‌లో ప్రమాదాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో నాగార్జున అగ్రికెమ్‌లో జరిగిన భారీ పేలుడు సంచలనం కలిగించింది. ఈ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి 40 గ్రామాల ప్రజల జీవనం ప్రశ్నార్థకమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల చిట్టా కొండవీటి చాంతాడంత అవుతుంది. ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు, క్షతగాత్రులు కేవలం రెక్కల కష్టాన్ని, శారీరక శ్రమను నమ్ముకున్న వారే. పొట్ట చేత పట్టుకుని పనుల కోసం జిల్లాలు, రాష్ట్రాలు దాటి వస్తున్న నిరు పేదలు. వీరు చనిపోతే మృతుల వివరాలు సైతం బయటికి రావు. మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించరు. ఎక్స్‌గ్రేషియా, పరిహారం వంటివి వారి దరి చేరవు. షాద్‌నగర్‌ ప్రమాదంలో మృతులు, గాయపపడ్డవారిలో ఎక్కువ మంది యుపి, బీహార్‌కు చెందిన వారే ఉండటం కార్మికుల దీన స్థితికి నిదర్శనం.
ప్రైవేటు యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ప్రభుత్వం బాధ్యతా రహితంగా చేతులు కట్టుకు కూర్చుంది. చాలా ఫ్యాక్టరీలకు కావాల్సిన అనుమతుల్లేవు. ప్రమాదాలను నివారించే, అప్రమత్తం చేసే చర్యలు శూన్యం. అగ్ని నిరోధక సాధనాలు నామమాత్రం. మాక్‌ డ్రిల్‌ ఊసే లేదు. కాలుష్య నియంత్రణ మండలి చోద్యం చూస్తోంది. ఫ్యాక్టరీలను తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ పని జరగట్లేదు. ఫ్యాక్టరీ, కార్మిక, కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక, తదితర ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అధికారుల అవినీతిలో యాజమాన్యాల అక్రమాలు కొట్టుకుపోతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అందాల్సిన సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. దీని వల్ల సకాలంలో వైద్యం అందక కార్మికులు చనిపోతున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం, వైద్యం, తదితర సౌకర్యాలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం ఎప్పుడూ మీనమేషాలే లెక్కిస్తోంది. చాలా సందర్భాల్లో యాజమాన్యాల కొమ్ముకాస్తోంది. ప్రమాదాలపై సకాలంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తే ఘోరాలు ఆగుతాయి. ప్రమాదాల నివారణకు పని ప్రదేశాల్లో ముందస్తు చర్యలు చేపడితే కార్మికుల ప్రాణాలను కాపాడే వీలుంది. ప్రభుత్వం అటువంటి చర్యలపై ఉదాసీనంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఆ వేడిలో హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకోనందువల్లనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏడాది క్రితం షాద్‌నగర్‌ మండలం కొత్తూరు వద్ద గల వినాయక స్టీల్స్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పటి ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంపై విచారిస్తున్న జైన్‌ కమిటీ డిజైన్‌, నాణ్యతా లోపాలను వదిలిపెట్టి ఉద్యోగులదే తప్పన్నట్లు చిత్రీకరిస్తోంది. సింగరేణిలోనూ పరిస్థితి ఇలానే ఉంది.

No comments: