http://apvarthalu.com/

Wednesday, September 12, 2012

బొత్స,చిరు మధ్య ఉప్పు-నిప్పుగా మారిన మాటల


                                  
అధికార కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొదట్లో ఒకే గ్రూపుగా ఉన్న పిసిసి చీఫ్‌ బొత్స....ఎంపీ చిరంజీవి ఇపుడు ఉప్పు....నిప్పుగా మారారు. వీరి మధ్య ఇపుడు మాటకు మాట నడుస్తోందనడానికి ఈ ఇద్దరు నేతల తాజా కామెంట్సే నిదర్శనం.
గ్రూపు రాజకీయాలకు నిలయమైన అధికార కాంగ్రెస్‌లో సమీకరణాలు పార్టీ నేతలే ఆశ్చర్యపోయేలా మారుతున్నాయి. ఒకే గూటి పక్షులుగా ఉన్న పిసిసి చీఫ్‌ బొత్స... ఎంపీ చిరంజీవి మధ్య ఇపుడు మాటల తూటాలు పేలుతున్నాయి. సిఎం, పిసిసి చీఫ్‌లను మారుస్తారంటూ పార్టీలో ప్రచారం జరగుతున్న నేపధ్యంలో ... బొత్స పనితీరు బాగాలేదంటూ సోనియా వద్ద చిరంజీవి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఉప ఎన్నికల ఓటమిపై పార్టీ నేతలతో మేధోమధనం నిర్వహించాలంటూ ఎంపీ వి.హనుమంతారావు చేసిన డిమాండ్‌ను పిసిసి చీఫ్‌ బొత్స తిరస్కరిస్తే.. చిరంజీవి ఆ సమావేశానికి హాజరయ్యారు. పైగా బొత్స వైఫల్యాన్ని ఎత్తిచూపే వ్యాఖ్యలు చేశారు. పిసిసి చీఫ్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి సిఎం కిరణ్‌కు వ్యతిరేకంగా అసమ్మతి రాజకీయాలు నడుపుతున్న బొత్స కాంగ్రెస్‌లో చిరంజీవి విలీనం అయ్యాక....ఆయనను తన గ్రూపులో కలుపుకున్నారు. గత డిసెంబర్‌లో అవిశ్వాసం సందర్భంగా కూడా చిరంజీవితో అసమ్మతి చిచ్చు రేపి .... తర్వాత దాన్ని తానే చల్లార్చినట్టు కనిపించే డ్రామాను కూడా రక్తికట్టించిన బొత్స దూకుడు ఎక్కువ కాలం చెల్లుబాటు కాలేదు. తనను అడ్డం పెట్టకుని బొత్స అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నారని.... అది తనకు ఇబ్బందిగా మారుతోందని గ్రహించిన చిరంజీవి క్రమేణ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. లిక్కర్‌ సిండికేట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిఎంకు లేఖ రాసిన చిరంజీవి....సిండికేట్‌ను వెనకుండి నడిపిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలనడంతో ఆయనకు బొత్సకు మధ్య విభేదాలకు బీజం వేసింది. అప్పట్నుంచి చిరంజీవి సిఎం కిరణ్‌కు అనుకూలంగా మారడమే కాకుండా తన ఎమ్మెల్యేలను ఇద్దరు మంత్రులను కూడా సిఎంకు మద్దతిచ్చేలా చేశారు. ఈ పరిణమాలను బొత్స జీర్ణించుకోలేక పోయారు. చిరంజీవి తనకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా తన నాయకత్వాన్ని కూడా ప్రశ్నించడంతో ఆయనపై సెటైర్లు వేశారు. అసమ్మతి రాజకీయాల కారణంగా పిసిసి చీఫ్‌ పదవిని బొత్స త్వరలోనే కోల్పోవాల్సి వస్తుందనేది కాంగ్రెస్‌ నేతల అంచనా. హై కమాండ్‌ ఆశీస్సులుంటేనే గ్రూపు రాజకీయాలతో ప్రయోజనముంటుందని.... లేదంటే ఇబ్బందులు తప్పవంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.

No comments: