శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయిన వెంటనే విపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. వాటిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనంటూ విపక్షాల సభ్యులు పట్టుపట్టారు. దీంతో అసెంబ్లీలో రగడ నెలకొని సభ గంటపాటు వాయిదా పడింది. వాయిదా పడిన అనంతరం తిరిగి అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమయింది. విద్యుత్ సమస్యపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒకానొక దశలో సభ్యులు స్పీకర్ పొడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. దీంతో సభాపతి నాదెండ్ల మనోహర్ స«భ సజావుగా నడిపేందుకు సహకరించాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ టీఆర్ఎస్ సభ్యులు వినలేదు. దీంతో సభను మళ్ళీ అరగంటపాటు వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ సజావుగా నడిపే వాతావరణం కనిపించలేదు. విపక్షాలు తాము పట్టిన పట్టు వీడతేదు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
వాయిదా తీర్మానాలు : విద్యుత్ సమస్యపై తెలుగుదేశం పార్టీ, తెలంగాణపై తీర్మానం చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఫీ రియంబర్స్‌మెంట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, తెలంగాణ విమోచనా దినం అధికారికంగా ప్రకటించాలంటూ బీజేపీ, ఫించన్ చెల్లింపులో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
No comments:
Post a Comment