http://apvarthalu.com/

Monday, September 17, 2012

ఓయూ ఉద్రిక్తత

                              
ఉస్మానియా యూనివర్శిటీలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ విద్యార్థి జేఏసీ ఆర్ట్స్ కళాశాల వద్ద జాతీయ జెండాను ఎగుర వేసి అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లేందుకు బయలు దేరగా ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15ను ప్రభుత్వం ఏ విధంగా జరుపుకుంటుందో అదే మాదిరిగా తెలంగాణ విమోచన దినాన్ని కూడా అధికారికంగా జరపాలని, జాతీయ జెండాను ఎగురవేయాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. కాగా పోలీసుల కళ్లుగప్పి కొంత మంది ఓయూ విద్యార్థులు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని, కొందరు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జై తెలంగాణ అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. తెలంగాణ శాసనసభ్యులు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లాలని విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. 

No comments: