http://apvarthalu.com/

Sunday, September 30, 2012

భాగ్యనగరం రణరంగమైంది

భాగ్యనగరం రణరంగమైంది. పోలీసుల తూటాలు, లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాలు లెక్క చేయకుండా, బారీకేడ్లను తొలగించి, ముళ్లకంచెలపై నుండి దూకి తెలంగాణవాదులు చీమలదండులా సాగర హారానికి తరలి వచ్చారు. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు సాగర్‌ను వదిలేది లేదని ఖరాఖండిగా చెప్పారు. తాము శాంతియుతంగా కవాతు చేయడానికి సిద్ధమైనతే పోలీసులు తమపై నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని, తెలంగాణవాదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినప్పటికీ తెలంగాణవాదులు ఎలాంటి హింసామార్గాన్ని చేపట్టకుండా లక్షలాదిగా తరలి వచ్చారని అంటున్నారు. జనసాగరంగా మారిన సాగరహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ... తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు నెక్లెస్ రోడ్డు కవాతుకు తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలు, ప్రజా సంఘాలు ఇలా ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణవాదులు సాగర తీరానికి చేరుకున్నారు. నెక్లెస్ రోడ్డు, పివి ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ అన్నీ ఇసుక వేస్తే రాలనంతగా మారాయి. నేల ఈనిందా అన్న మాదిరిగా నెక్లెస్ రోడ్డు తెలంగాణవాదులతో నిండిపోయింది. నగరం మొత్తం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మూడు గంటలకే ప్రారంభమవుతుందనుకున్న సాగరహారం అరెస్టులు, నిర్బంధాల కారణంగా రెండున్నర, మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అంతకుముందు వివిధ జిల్లాల నుండి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్టులను పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. అరెస్టులను నిరసిస్తూ తెరాస ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిశారు. టిటిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో రెండుసార్లు అరెస్టయ్యారు. సొంత పార్టీ నేతల నుండి కిరణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కిరణ్, డిజిపి వైఖరిపై నిప్పులు చెరిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఓ అడుగు ముందుకేసి... తెలంగాణవాదులను రెచ్చగొడితే తాము పదవులను త్యజించడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. మధ్యాహ్నం అనుకున్న సమయానికి ఆయా పార్టీలు, ప్రజా సంఘాల ర్యాలీలు నిర్దేషిత ప్రాంతాల నుండి ప్రారంభమయ్యాయి. పోలీసులు ర్యాలీలను ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. పోలీసులు, తెలంగాణవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణవాదులు బారీకేడ్లు తొలగించి, ముళ్లకంచెలు పెకిలించి వేదిక వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణవాదులు కూడా పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీడియా ఓబి వ్యాన్లకు, నెక్లెస్ రైల్వే స్టేషన్‌కు, రెండు పోలీసు జీపులకు నిప్పు అంటించారు. సాయంత్రం కవాతు వేదిక వద్దకు వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తదితరులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులపై తెలంగాణవాదులదే పైచేయి అయింది. ఎక్కడికి అక్కడ పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కాలు కాలు కదిపి కదం తొక్కారు. డిజిపి దినేష్ రెడ్డి నగరంలో ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. తూటాలకు వెన్నుచూపని ఓయు విద్యార్థులు! కవాతు నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రణరంగమైంది. ఓయు విద్యార్థులు బైక్ ర్యాలీతో కవాతు వేదిక వద్దకు బయలుదేరారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకొని ముందుకు కదలనివ్వలేదు. తాము బైక్ ర్యాలీతోనే వెళ్తామని విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులు కూడా అంతే ధీటుగా పోలీసుల పైకి రాళ్ల వర్షం కురిపించారు. శాంతియుతంగా కవాతు చేస్తామని.. అనుమతిస్తే మంచిదని లేకుంటే తాము అదే తీరుగా స్పందిస్తామని పోలీసులు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ విద్యార్థికి రబ్బరు తూటా తగిలి గాయమైంది. తూటా తగిలినా, బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ విద్యార్థులు వెనుకంజ వేయలేదు. నెక్లెస్ రెడ్డు తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతరను తలపించింది.

No comments: