http://apvarthalu.com/

Thursday, November 1, 2012

ఆలయాలలో చోరీలన్నీ మాఫియా పనేనా..!

హైదరాబాద్ సిటీ బంగారం ధర చుక్కలనంటుతుండటంతో దొంగల దృష్టి ఆలయాలపై పడిందని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.. రెండో వైపు చూస్తే.. ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. దొంగసొత్తును మార్కెట్లో విక్రయిస్తే అందులో సగం మాత్రమే వస్తోందన్న సంగతి తెలిసిందే. ఆలయాల్లో దొంగిలించిన సొత్తుకు మాత్రం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క పురాతన వస్తువు చేతిలో పడినా దొంగల పంట పండినట్టే. ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అమ్మవారి ఆభరణాలు, పురాతన పంచలోహ విగ్రహాల చోరీ వెనుక పెద్ద కథే దాగి ఉంది. ఈ మాఫియా చీకటి వ్యాపారంపై ప్రత్యేక కథనం.. పురాతన వస్తువులెన్నో..నగరంలో పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. వీటిలో అమ్మవారి ఆలయాలే అధికంగా ఉన్నాయి. బంగారం, వజ్రకిరీటాలు, ఆభరణాలు, ముక్కుపుడకలు, గాజులు అమ్మవారి విగ్రహాలకు అలంకరిస్తున్నారు. కొందరు భక్తులు వేలు, లక్షల రూపాయలు ఖర్చు బెట్టి ఆభరణాలను తయారు చేయించి కానుకలుగా సమర్పిస్తున్నారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయంతో కమిటీ సభ్యులు కూడా అమ్మవారికి బంగారు వస్తువులు చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, క్రీస్తు పూర్వం, నిజాం నవాబుల కాలంలో వెలసిన గుళ్లలో ఎన్నో రకాల పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. పూజలకు వినియోగించే పంచలోహ పాత్రలూ ఉన్నాయి. వీటిలో అమ్మవారు, గణేశ్, రామలక్ష్మణులు, నటరాజు వంటి విగ్రహాలతో పాటు అరుదుగా కనిపించే శంఖాలు కూడా ఉంటున్నాయి. విలువ లక్షలు, కోట్లేనటఅమ్మవార్లు ధరించిన ఆభరణాలు, పురాతన విగ్రహాలతో సహా ఆలయాల్లోని ఇతర ఏ వస్తువుకైనా అతీతశక్తులు ఉంటాయని భక్తులు భావిస్తుంటారు. కానుకలుగా సమర్పించిన కొత్త వస్తువులైనా.. కొద్దిరోజులు పూజలందుకుంటే చాలు వాటికీ మహిమలు ఉంటాయని నమ్ముతుంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వీటికి గిరాకీ బాగా ఉంటోంది. శక్తులు ఉన్నాయన్న నమ్మకంతో వాటి విలువ లక్షలు, కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు తెలుస్తోంది. పురాతన విగ్రహాలంటూ విక్రయిస్తున్న 12 ముఠాలను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టార్గెట్ అందుకేనా.. నగరం, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరి«ధిలోని పురాతన ఆలయాలపై దొంగల ముఠాలు విరుచుకుపడుతున్నాయి. రెక్కీ నిర్వహించి మరీ ఆలయాలలోని సొత్తును కొల్లగొడుతున్నాయి. జంట కమిషనరేట్లలోని చిన్నా,చితకా అన్నీ కలిపి ఈ ఏడాది అక్టోబర్ వరకు 27 ఆలయాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ నెలలో జరిగిన దొంగతనాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది లాల్‌దర్వాజలోని మహంకాళి ఆలయమే. గోల్నాకలోని నల్లపోచమ్మ, ఉప్పుగూడలోని రెండు ఆలయాలలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. కార్వాన్‌లోని ఓ ఆలయంలో పురాతన విగ్రహాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా తెలివిగా నేరాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలు ఈ సొత్తునంతా గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్నో మాఫియా ముఠాలుదేశంలో ఎన్నో మాఫియా ముఠాలు చీకటి వ్యాపారం చేస్తున్నాయి. ఇందులో కరుడుగట్టిన నేరస్తులు, దొంగలతో పాటు కొందరు వ్యాపారులు కూడా ఉంటున్నారని సమాచారం. ఇతర రాష్ట్రాలతో పాటు నగరంలో కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఉన్న చాలామంది ఇదే పనిలో నిమగ్నమై ఉంటున్నారు. ఇలాంటి వారు నలురైదుగురు కలిస్తే చాలు.. ప్రధానంగా ఇదే విషయంపై చర్చించుకుంటూ ఉంటారు. అమ్మవారి అభరణాలు, పురాతన విగ్రహాలే కాకుండా నాణేలు, రెండు తలల పాములను కూడా విక్రయిస్తున్నారు. అంతెందుకు ఇటీవలికాలంలో అయిదు రూపాయల నోటుకు 50 రూపాయలు ఇచ్చి ఈ మాఫియా హల్‌చల్ చేసింది. సాధారణంగా పొలాలలో దొరికే రెండు తలల పాము, నక్షత్ర తాబేళ్లు, రంగురాళ్ల ధరను లక్షలు, కోట్లు పలికేలా చేశారు. మార్కెట్లో అమ్మవారి ఆభరణాలకు ఉన్న డిమాండ్‌తో లబ్దిపొందేందుకే ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారన్న విషయం పోలీసులకు తెలిసినా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దర్యాప్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

No comments: