http://apvarthalu.com/

Sunday, November 11, 2012

హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్!

హైదరాబాద్ పాతబస్తీ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. చార్మినార్ ప్రాంగణంలోనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం కేంద్రంగా ఇటు మతపరమైన, అటు రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. పాతబస్తీలోని చార్మినార్ కు ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయ మరమ్మతులు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. దీపావళి పండుగ సందర్భంగా శిథిలావస్థకు చేరుకున్న ఆలయ షెడ్‌ను ఈ నెల 1న తొలగించి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. అది చూసిన మరో వర్గం ప్రజలు ఆలయాన్ని విస్తరిస్తున్నారని అపార్ధం చేసుకున్నారు. పనులకు అడ్డుతగిలారు. ఆ తరువాత ఎంఐఎం చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ ఆందోళనకు దిగటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ తరువాత దేవాలయ నిర్వాహకురాలి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వక్తం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు లోబడి ఆదివారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య షెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్బంగా మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పాతబస్తీ భగ్గుమంది. 

No comments: