http://apvarthalu.com/

Monday, September 10, 2012

కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్

నిజానికి వైఎస్ తదనంతరం పలు సందర్భాల్లో కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకోవడం, కాంగ్రెస్‌ను బాబు పలువిధాలుగా ఆదుకుంటూ వస్తుండటం బహిరంగ రహస్యమే. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి ముందు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బాబు ససేమిరా అనడం తెలిసిందే. ఆ సందర్భంలోనే ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో ఫోన్లో మాట్లాడారని, రాష్ట్ర సర్కారుకు ఢోకా ఉండదని, ముఖ్యంగా తన వల్ల ఎలాంటి సమస్యా ఉండదని భరోసా ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించబోదని బాబు హామీ ఇచ్చారని, ఆయన నుంచి ఈ రకమైన మద్దతు చూసి విస్మయానికి లోనైన పటేల్, ‘అవసరమైనప్పుడు మీ మద్దతు తప్పక తీసుకుంటాం’ అని చెప్పారని ఢిల్లీ వర్గాల్లో విన్పించింది. 
అందుకు తగ్గట్టే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ బలం పెరిగాక మాత్రమే బాబు అవిశ్వాసం పెట్టి మమ అన్పించారు. అంతేగాక.. ‘ఇకపై అవిశ్వాసం పెట్టబోం’ అంటూ కరాఖండిగా ప్రకటన కూడా చేశారు! 2011 ఆగస్టులో రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా బాబు ఒక రాత్రి ఎస్పీజీ, పోలీసు భద్రత లేకుండా ఒక ఎంపీ, తన వ్యక్తిగత భద్రతాధికారితో కలిసి ప్రైవేటు వాహనంలో వెళ్లి మరీ కేంద్రంలోని ఓ కీలక మంత్రితో మంతనాలు జరిపారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఎమ్మార్ కుంభకోణం నుంచి సాంత్వన చేకూర్చాల్సిందిగా ఆయన్ను బాబు కోరారని కూడా చెప్పుకున్నారు. బాబు గానీ, టీడీపీ గానీ వాటిని ఖండించలేదు కూడా. ‘బాబు వచ్చి నన్ను కలిశారు’ అంటూ కొంతకాలానికే అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం సాక్షాత్తూ లోక్‌సభలోనే ప్రకటించారు! ఇలా వైఎస్ మరణానంతరం రెండున్నరేళ్లుగా అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న బాబు.. తాజాగా ప్రధాని భేటీలో కూడా ఏదో ‘కీలకాంశం’పైనే చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

No comments: