http://apvarthalu.com/

Wednesday, November 7, 2012

ఇక నుంచి తెలుగు అక్షరాలే కన్పించాలి


రాష్ట్రంలో ఇక ఎక్కడైనా తెలుగు అక్షరాలే కనిపించాలని అలా కన్పించకపోతే జరిమానా తప్పదని అధికార తెలుగు భాష సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ హెచ్చరించారు. రాజధానిలో ఉన్న లక్షలాది వ్యాపార దుకాణాలపై నామకరణాలు ఇంగ్లీష్‌లో ఉండడం క్షమార్హం కాదని ఆయన అన్నారు. తెలుగు మహాసభలు జరిగే సమయానికి రాష్ట్రంలో ప్రతి చోటా తెలుగు అక్షరాలు కన్పించాలని ఆశిస్తున్నామని అన్నారు. తిరుపతిలో జరగనున్న తెలుగు మహాసభలపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు వ్యాపార దుకాణాల నామఫలకాలు తెలుగులో స్పష్టంగా కన్పించే విధంగా ఉండాలని బుద్ధ ప్రసాద్ సూచించారు. 1966లో తెలుగు భాషను చట్టంగా రూపొందిచుకున్నామని అందుచేత తెలుగును భావనా భాషగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రథమ భాషగా తెలుగు, ద్వితీయ భాషగా ఉర్దూ, తృతీయ భాషగా ఇంగ్లీషును వాడాలని ఆయన సూచించారు. శాస్త్ర సాంకేతిక అంశాలను అందిపుచ్చుకున్న నేటి తరంలో తెలుగుకు ఉపకరణాలు తీసుకురావడం జరిగిందన్నారు. వీటికి కీ బోర్డు కూడా తీసుకురావడం జరుగుతుందని ఆయన చెప్పారు. తెలుగులో పదాలు కంపోజింగ్ చేసే సమయంలో తప్పులు దొర్లినప్పుడు వెంటనే సరైన పదాలు వచ్చే విధంగా నిఘంటువును తయారు చేశామన్నారు. త్వరలో అన్ని శాఖలకు పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు. నాగార్జున యూనివర్సిటీలో తెలుగుభాషను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే కడప యోగివేమన యూనివర్సిటీ స్నాతకోత్సవాల్లో ఉపకులపతి రామచంద్రారెడ్డి తెలుగులో ప్రసంగం చేయడం తొలి విజయంగా ఆయన చెప్పారు. తెలుగు మహాసభలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలుగు మహాసభల గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ఆయ అన్నారు. తెలుగుభాషకు ఔన్నత్యాన్ని చేకూర్చేందుకు అధికార తెలుగు భాషా సంఘం తొలి సమావేశం సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేశామన్నారు.

No comments: