http://apvarthalu.com/

Sunday, November 11, 2012

చిక్కుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా, మూలుగుతూ ముక్కుతూ నడుస్తున్న కిరణ్ ప్రభుత్వంపై పాతబస్తీ గ్యాంగ్ లీడర్ ఒవైసీ విరుచుకుపడ్డాడు. తమ పార్టీ నాయకుల విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడుతున్నాడు. సరాసరి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని తన అస్త్రాన్ని సంధించాడు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. చార్మినార్ ను అనుకుని ఉన్న భాగ్య లక్ష్మీ ఆలయం విషయంలో మజ్లిస్ పార్టీ నాయకులు అతి చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మజ్లిస్ పార్టీ మండిపడుతోంది. తమ మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వంలో తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం ఏమిటని వారు వాదిస్తన్నారు. వివాదాన్ని ఎవరు రాజేశారు అనేది పాయింటుకాదు కానీ, ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి మీద పడుతుండటం విషయం. ఒవైసీలకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. ఢిల్లీ జుమా మసీద్ ఇమామ్ స్థాయిలో ఒవైసీలను ట్రీట్ చేస్తూ వస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. మరి ఒవైసీ మద్దతు ఉపసంహరించుకుంటాను అంటే వారు ఉలిక్కిపడతారు. ముస్లింలంతా తమకు దూరం అయిపోయారని బాధపడతారు. దీంతో ఇప్పుడు కేంద్రం నుంచి కిరణ్ కు మొటిక్కాయలు తప్పకపోవచ్చు. సన్నిహితులను దూరం చేస్తున్నావని కిరణ్ పై కేంద్రం మండిపడ వచ్చు.మొత్తానికి పాతబస్తీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని  అసదుద్దీన్ ఒవైసీ అంటున్నాడు. సోమవార ఉదయం 11 గంటలకు ఎంఐఎం కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నామని ఆయన అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చే అంశంపై  మధ్యాహ్నానికి ఒక  ప్రకటన చేస్తామని ఆయన వివరించాడు. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందో ఇకపై! మరో పక్క తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ వేడి రుచి చూపించేందుకు సమాయత్తమవుతున్నారు. డిసెంబర్ 9లోపు తేల్చాలని డెడ్ లైన్ కూడా విధించారు. లేకుంటే వారు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది నిజమేనన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు బానిసలవుతారని తాను అనుకోవడంలేదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. చివరిసారిగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు నిర్ణయించుకున్నారు. ఆ లేఖలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, అందులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని, తమ బాధని, ఆవేదనని వివరించాలని అనుకుంటున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి ఇదే సమయం అని వారు భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ తప్ప తమకు ప్రత్యేక ప్యాకేజీలు అవసరంలేదని వారు తెగేసి చెబుతున్నారు. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడతారా? లేదా? అనేది తమ నేత సోనియాకు రాసే లేఖలో పేర్కొననున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామనడం రాజకీయంగా గొప్ప త్యాగంగా ఆయన వర్ణించారు. 

No comments: