http://apvarthalu.com/

Tuesday, October 30, 2012

తుపాన్‌గా మారిన వాయుగుండం


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుపాన్‌గా మారింది. దీనిని 'నీలం'గా చెన్నై వాతావరణ కేంద్రం ఖారారు చేసింది. తుపాన్ చెన్నైయ్‌కు ఆగ్నేయంగా500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సముద్రంలో అలల ఉధృతి పెరింగింది. గంటకు సుమారు 45 నుంచి 60 కిలోమీటర్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావంతో తమిళనాడులో, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు - నాగపట్నం మధ్య బుధవారం రాత్రి లోగా తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్‌ నవంబరు 2 నాటికి అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైబడి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వచ్చే 48 గంటలు సముద్రం కల్లోలంగా ఉంటుందని, మరోవైపు చెన్నై పోర్టులో అధికారులు ఏడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నాగపట్నం, తూతుకూడి, కారేకల్ పోర్టుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీగా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత తీరం దిశగా వచ్చేసరికి గాలుల తీవ్రత పెరుగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తీరప్రాంత జిల్లాల్లో అలజడి మొదలైంది. కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడ రేవుల్లో ఇప్పటికే మూడో నెంబరు ప్రమాదహెచ్చరిక ఎగరేయగా, తమిళనాడులోని పలు తీర ప్రాంతాల్లో నాలుగోనెంబరు హెచ్చరిక ఎగరేశారు. తుఫానుగా మారే వాయుగుండం నెల్లూరు- నాగపట్నం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరిగింది. అల్లూరు మండలం ఇస్కపాళెం వద్ద తుఫానుషెల్టర్ కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు వీస్తున్నాయి.

No comments: