http://apvarthalu.com/

Thursday, September 20, 2012

పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తా...శేఖర్ కమ్ముల


దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా మేకింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. ఇటీవల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన శేఖర్ కమ్ముల అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని స్పష్టం చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...‘నా ఫేవరెట్ హీరో చిరంజీవి. పవన్ కళ్యాణ్ నాకు అందనంత ఎత్తులో ఉన్నారు. పవన్ అంటే నాకు ఎంతో ఇష్టం అతనితో సినిమా చేయాలని ఉంది. నాకు అవకాశం వస్తే ఎప్పటికైనా తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా' అని వెల్లడించారు.

సింహవాహనంపై మురిపించిన శ్రీనివాసుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేంకటేశ్వర స్వామి సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం స్వామివారి ఉత్సవర్లయిన మలయప్పకు విశేష సమర్పణ గావించారు. అనంతరం స్వామివారు వాహనమండపానికి వేంచేశారు. అక్కడ వజ్రవైఢూర్యాలతో అలంకార శోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి సింహవాహనాన్ని అధిరోహించారు. మృగరాజైన సింహాన్ని లోబరుచుకుని వాహనం చేసుకున్న ఆనందంతో యోగముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీ«ధులలో రెండు గంటలపాటు సాగిన స్వామివారి ఊరేగింపు భక్తులను తన్మయులను చేసింది. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామికి, దేవేరులు శ్రీదేవి,భూదేవిలకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. ఉత్సవర్లకు విశేష సమర్పణ నిర్వహించారు. రాత్రి 9 గంటకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

రాష్ట్రంలో పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి


డీ జిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతిపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పెంచిన ధరలు తగ్గించాలని డిమాంద్ చేస్తూ విపక్షాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. బంద్‌కు మద్దతు తెలుపుతూ విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న విపక్షాల నేతలు, కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన బస్సులను నిలిపివేశారు.
* హైదరాబాద్ : బంద్ సందర్భంగా ఎంజీబీఎస్ బస్‌స్టాండ్ ఎదుట వాపక్షాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం సీపీఐ నేత నారాయణ సహా, టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోలన కారులు నిరసన తెలపడంటో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
* విశాఖపట్నం : మద్దిలపాలెంలో విపక్షాలు రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేపై కార్యకర్తలు కబడ్డీ ఆట ఆడుతూ నిరసన తెలిపారు.
* విజయనగరం : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. రైల్వే స్టేషన్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు.
* మహబూబ్‌నగర్ : జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ధర్నా చేపట్టాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* చిత్తూరు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* విజయవాడ : నగరంలోని బస్టాండ్ దగ్గర విపక్షాలు ఆందోళన చేపట్టారు. బస్సులు కదలకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఏలూరు రోడ్డులో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. సీపీఎం నేత బాబూరావు సహా, పలువురిని అరెస్ట్ చేవారు.
* కృష్ణా జిల్లా : జిల్లాలోని కైకలూరులో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ప్రభుత్వ, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* అనంతపురం : జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* వరంగల్ : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్ష నేతలు ఆందోలనలకు దిగాయి. హన్మకొండ, పరకాల బస్టాండ్ దగ్గర టీడీపీ, బీజేపీ, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* మెదక్ : జిల్లాలో వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
* ఖమ్మం : జిల్లాలోని ఆరు డిపోలో బస్సులు నిలిచిపోయాయి. వైరా రోడ్డులోని పెట్రోల్ బంక్‌పై ఆందోళకారులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
* నల్గొండ : బంద్ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు బైఠాయించి నిరసన చేశారు.

Monday, September 17, 2012

ఓయూ ఉద్రిక్తత

                              
ఉస్మానియా యూనివర్శిటీలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ విద్యార్థి జేఏసీ ఆర్ట్స్ కళాశాల వద్ద జాతీయ జెండాను ఎగుర వేసి అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లేందుకు బయలు దేరగా ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15ను ప్రభుత్వం ఏ విధంగా జరుపుకుంటుందో అదే మాదిరిగా తెలంగాణ విమోచన దినాన్ని కూడా అధికారికంగా జరపాలని, జాతీయ జెండాను ఎగురవేయాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. కాగా పోలీసుల కళ్లుగప్పి కొంత మంది ఓయూ విద్యార్థులు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని, కొందరు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జై తెలంగాణ అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. తెలంగాణ శాసనసభ్యులు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లాలని విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. 

సీతమ్మ వాకిట్లో మహేష్,సమంత పెళ్ళి


                                   
చెన్నై శివారు కొబ్బరి తోటలో ఓ సెట్ వేసి మహేష్,సమంత పెళ్ళికి సంబంధంచిన ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.వెంకటేష్, మహేష్‌బాబు, సమంత, అంజలి కాంబినేషన్‌లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. డిసెంబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. చలి పులి పంజా విసిరే సమయంలో సందడి చేసేందుకు వెంకటేష్‌, మహేష్‌బాబు సన్నద్ధమవుతున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ...''పదహారణాల తెలుగుదనాన్ని ఆవిష్కరించే కుటుంబ కథా చిత్రమిది. ఇటీవలే చెన్నైలో పెళ్లి పాటతోపాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించాం. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో కోటి రూపాయల వ్యయంతో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఓ భారీ సెట్‌ నిర్మించాం. అక్కడ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల్ని త్వరలో చిత్రీకరిస్తాం. ఈ సినిమాలో అయిదు పాటలున్నాయి. ఇప్పటికే మూడింటిని చిత్రీకరించాం. నవంబరులో పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

శాసనసభలో రగడ తెలంగాణ తీర్మానం కోసం టీఆర్ఎస్ పట్టు


                                         
శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయిన వెంటనే విపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. వాటిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనంటూ విపక్షాల సభ్యులు పట్టుపట్టారు. దీంతో అసెంబ్లీలో రగడ నెలకొని సభ గంటపాటు వాయిదా పడింది. వాయిదా పడిన అనంతరం తిరిగి అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమయింది. విద్యుత్ సమస్యపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒకానొక దశలో సభ్యులు స్పీకర్ పొడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. దీంతో సభాపతి నాదెండ్ల మనోహర్ స«భ సజావుగా నడిపేందుకు సహకరించాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ టీఆర్ఎస్ సభ్యులు వినలేదు. దీంతో సభను మళ్ళీ అరగంటపాటు వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ సజావుగా నడిపే వాతావరణం కనిపించలేదు. విపక్షాలు తాము పట్టిన పట్టు వీడతేదు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
వాయిదా తీర్మానాలు : విద్యుత్ సమస్యపై తెలుగుదేశం పార్టీ, తెలంగాణపై తీర్మానం చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఫీ రియంబర్స్‌మెంట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, తెలంగాణ విమోచనా దినం అధికారికంగా ప్రకటించాలంటూ బీజేపీ, ఫించన్ చెల్లింపులో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

Thursday, September 13, 2012

చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ రూ. 35.59 కోట్లు

                                                 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ, కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను గురువారం ప్రకటించారు. ప్రతిఏటా తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని అన్నారు. తాను ఆస్తులు ప్రకటించిన తర్వాతే కేంద్ర మంత్రి వర్గంలో చలనం వచ్చిందన్నారు. దేశంలో అవినీతి పెరిగిపోయందని, దేశం బాగుపడాలంటే ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తన నివాసం నుంచి గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కామన్వెల్త్, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం, అలాగే రాష్ట్రంలో ఓఎంసీ, స్టాంపుల కుంభకోణం ఇలాంటి అవినీతిపై తాము పోరాటం చేస్తుంటే ఎదురుదాడి చేసి నాయకులు తప్పించుకుంటున్నారని అన్నారు. అటు కేంద్రంలో కూడా ఇదే పరిస్థితిలో ఉందని చంద్రబాబు విమర్శించారు.

కొందరు నేతలు రాజకీయాలను స్వార్ధం కోసం వాడుకుని కోట్ల రూపాయలు కూడబెదుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమలాగే మిగతా రాజకీయనాయకులు వారి ఆస్తులను ప్రకటించాలని ఆయన అన్నారు. అవినీతిపై పోరాటం చేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే పార్టీ పెట్టి పరపతిని కోల్పోయారని అన్నారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబు అవినీతిపై పోరాటం చేస్తునే ఉన్నారని అన్నారు.

భువనేశ్వరి (చంద్రబాబు సతీమణి) నిర్వహిస్తున్న వ్యాపారాలకు ఎక్కడా ప్రభుత్వ భూమి కానీ ఇతర లబ్ది కానీ పొందలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు ఎకరాలు, రెండువేల కోట్ల రూపాయలు అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. సింగపూర్‌లో హోటల్స్ ఉన్నాయని చెప్పిన వారు నిరూపించాలని చంద్రబాబు సవాల్ చేశారు.

ఆస్తుల వివరాలు :
తమ కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ : రూ. 35.59 కోట్లు
చంద్రబాబు పేరున ఉన్న ఆస్తి : రూ. 31.97 లక్షలు
1985 నుంచి 1992 మధ్యలో నిర్మించిన ఇల్లు, కారు చంద్రబాబు పేరుమీద ఉన్నాయి.
భువనేశ్వరి పేరుమీద ఉన్న ఆస్తుల విలువ : రూ. 24.57 కోట్లు.
కుమారుడు లోక్‌ష్ పేరుమీద ఉన్న ఆస్తి : రూ. 6.62 కోట్లు
కోడలు బ్రహ్మణి పేరుమీద ఉన్న ఆస్తి : రూ. 2.09 కోట్లు.
అలాగే అప్పులు కూడా ఉన్నాయని భువనేశ్వరి పేరు మీద అప్పులు : రూ. 12.38 కోట్లు, లోకేష్ నాయుడు పేరు మీద : రూ. 9 లక్షలు అప్పులు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.