http://apvarthalu.com/

Thursday, October 4, 2012

జగన్ బెయిల్ కోసం గుళ్లలో పూజలు


వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని, ఆయనకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెయిల్ రావాలని కోరుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా యువజన విభాగం కార్యకర్తలు అరసవల్లి సూర్య నారాయణ దేవాలయంలో గురువారం 1,101 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అర్చన చేయించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద 1,116 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ త్వరలో బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జగన్ క్షేమం కోరుతూ పార్టీ నేతల ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ నుండి మంకమ్మ తోట వరకు పాదయాత్ర చేసి, ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. హైదరాబాదులోని అంబర్ పేట నుండి జిడి కాలనీ వరకు పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 250 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రేమికులపై దాడి

విహారానికి వచ్చిన ప్రేమికులపై గుర్తుతెలియని దుండుగులు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా టైగల్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులు వీరు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేటకు చెందిన అజిత, మునిరాజులుగా గుర్తించారు.

రాయలసీమ అభివృద్ధికి రూ. లక్ష కోట్లు ఇవ్వండి...మంత్రి టీజీ వెంకటేష్

రాయలసీమ అన్ని వనరులకు నిలయం అని, కాని వాస్తవానికి మాత్రం అల్లుని నోట్లో శని అన్నట్టు రాయలసీమలో దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయని మంత్రి టి.జి. వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవితో మంత్రి టీజీ వెంకటేష్ బృందం గురువారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం మంత్రి టీజీ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ అన్నివిధాల వెనుకబడి ఉందని సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వాయలార్‌ను కోరినట్లు తెలిపారు. రాయవసీమలో బంగారు గనులకు కొదవ లేదని, అలాగే వజ్రాలకు పెట్టింది పేరు అని, ఎన్నో వనరులు ఉన్నా ఫలితం మాత్రం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ బెయిల్‌పై సుప్రీంలో రేపు విచారణ

శుక్రవారం జగన్ బెయిల్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జగన్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఇంతవరకు సీబీఐ, ఈడీలు చేసిన విచారణ వృధా అవుతుందని భావిస్తూ ఈడీ ఈరోజు అన్నీ ఆధారాలతో జగన్ అండ్ కో స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ పిటిషన్‌పై వాదించే వాదనలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝలిపించింది. జగన్మోహన్‌రెడ్డి ఆయన ద్వారా లబ్ది పొందిన వారి స్థిర చరాస్తులను ఈడీ గురువారం జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘనగా ఈడీ నిర్ధారిస్తూ, రూ. 51 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. జననీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాల భూమి, జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ. 14 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి ప్రభుత్వం ద్వారా (అక్రమార్గంలో) పలు విధాలుగా అంటే సెజ్‌లు, ఇరిగేషన్, రియల్ ఎస్టేట్, వెంచర్లు, గనుల కేటాయింపులు తదితర వాటి ద్వారా లభ్ది పొందిన కంపెనీలు, జగన్ సంస్థలకు పెట్టుబడుల రూపంలో లంచాలు ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో నిర్ధారించి, ఈ నేపథ్యంలోనే వారి ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. హెటోరో డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమి, మూడు కోట్ల రూపాయల పిక్సిడ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. ఆరబిందో ఫార్మాకు సంబంధించి 95 ఎకరాల భూమి, రూ. 3 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది. సీబీఐ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఆస్తులను జప్తు చేసింది. హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలు రూ.8.60 కోట్లు లబ్ధి పొందేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఈడీ నిర్దారించింది. ఈ రెండు సంస్థలకు ఏపీ ప్రభుత్వం 75 ఎకరాల చొప్పున భూమిని కేటాయించిందని పేర్కొంది. మరో సంస్థ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ 30.33 ఎకరాల భూమిని పొందడం ద్వారా రూ.4.30 కోట్లు లబ్ధి పొందిందని వివరించింది. భూముల కేటాయింపులో ప్రభుత్వం ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి అడ్డదారిలో భూకేటాయింపులు జరిపిందని తెలిపింది. తదుపరి చర్యలకు కూడా ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలియవచ్చింది.

Wednesday, October 3, 2012

పవన్ కళ్యాణ్ సినిమా తో చేసే తీరిక లేదన్న... సమంత

కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అంటూ లేకుండా హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అమ్మడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఇటీవల గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సమంత ఖండించింది. ప్రస్తుతం తాను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నానని, వచ్చే ఏడాది వరకు తన డేట్స్ ఖాళీగా లేవని స్పష్టం చేసింది. ‘గతంలో కమిట్ అయిన సినిమాలే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వదలుచుకోలేదు' అని స్పష్టం చేసింది. ఇటీవల సమంత నటించిన ఈగ చిత్రం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణం కొంత కాలంగా షూటింగులకు దూరమైన సమంత ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. సమంత ప్రస్తుతం బోలెడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

పార్టీలోకి రావడానికి పర్మిషన్ అవసరంలేదు...నారా లోకేష్

పార్టీలోకి రావడానికి తనకు ఎవరి అనుమతి అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బుధవారం అన్నారు. తండ్రి పాదయాత్రలో పాలుపంచుకుంటున్న లోకేష్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ప్రజల సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్నారు. తాను 1995 నుండే పార్టీ కోసం పని చేస్తున్నానని, 1999 నుండి క్రియాశీలకంగా ఉన్నానని, పార్టీలోకి వచ్చేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. తన తండ్రి పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో లెక్కలేనన్ని ప్రజా సమస్యలు ఉన్నాయని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాబు కోసం రాత్రి రెండు గంటల వరకు వేచి చూస్తున్నారన్నారు. రాజకీయాలలోకి రావడం గొప్ప విషయమేమీ కాదన్నారు. కుప్పం నుండి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. దానికి లోకేష్... కుప్పం ప్రజలకు చంద్రబాబు దేవుడు అని, అక్కడి నుండి తాను పోటీ చేస్తే కుప్పం ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. 2009 ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించానని చెప్పారు. ఇకపై పార్టీ పటిష్టతపై సీరియస్‌గా దృష్టి సారిస్తానని లోకేష్ చెప్పారు. పాదయాత్రకు కుటుంబ సభ్యులు హాజరవుతారన్నారు.