http://apvarthalu.com/

Thursday, October 4, 2012

జగన్ బెయిల్ కోసం గుళ్లలో పూజలు


వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని, ఆయనకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెయిల్ రావాలని కోరుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా యువజన విభాగం కార్యకర్తలు అరసవల్లి సూర్య నారాయణ దేవాలయంలో గురువారం 1,101 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అర్చన చేయించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద 1,116 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ త్వరలో బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జగన్ క్షేమం కోరుతూ పార్టీ నేతల ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ నుండి మంకమ్మ తోట వరకు పాదయాత్ర చేసి, ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. హైదరాబాదులోని అంబర్ పేట నుండి జిడి కాలనీ వరకు పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 250 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

No comments: