http://apvarthalu.com/

Thursday, October 4, 2012

జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝలిపించింది. జగన్మోహన్‌రెడ్డి ఆయన ద్వారా లబ్ది పొందిన వారి స్థిర చరాస్తులను ఈడీ గురువారం జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘనగా ఈడీ నిర్ధారిస్తూ, రూ. 51 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. జననీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాల భూమి, జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ. 14 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి ప్రభుత్వం ద్వారా (అక్రమార్గంలో) పలు విధాలుగా అంటే సెజ్‌లు, ఇరిగేషన్, రియల్ ఎస్టేట్, వెంచర్లు, గనుల కేటాయింపులు తదితర వాటి ద్వారా లభ్ది పొందిన కంపెనీలు, జగన్ సంస్థలకు పెట్టుబడుల రూపంలో లంచాలు ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో నిర్ధారించి, ఈ నేపథ్యంలోనే వారి ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. హెటోరో డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమి, మూడు కోట్ల రూపాయల పిక్సిడ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. ఆరబిందో ఫార్మాకు సంబంధించి 95 ఎకరాల భూమి, రూ. 3 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది. సీబీఐ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఆస్తులను జప్తు చేసింది. హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలు రూ.8.60 కోట్లు లబ్ధి పొందేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఈడీ నిర్దారించింది. ఈ రెండు సంస్థలకు ఏపీ ప్రభుత్వం 75 ఎకరాల చొప్పున భూమిని కేటాయించిందని పేర్కొంది. మరో సంస్థ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ 30.33 ఎకరాల భూమిని పొందడం ద్వారా రూ.4.30 కోట్లు లబ్ధి పొందిందని వివరించింది. భూముల కేటాయింపులో ప్రభుత్వం ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి అడ్డదారిలో భూకేటాయింపులు జరిపిందని తెలిపింది. తదుపరి చర్యలకు కూడా ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలియవచ్చింది.

No comments: