తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కొరత ఏర్పడింది. దీంతో అదనపు లడ్డూ టోకన్లను టీటీడీ కుదించింది. వారం రోజులుగా తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీకి తగట్టుగా లడ్డూ ప్రసాదాలను అందించారు. రోజువారి తయారీతో పోలిస్తే భక్తులకు పంపిణీ చేసిన లడ్డూలే అధికంగా ఉంది. దీంతో ఆలయ పోటులో నిల్వ ఉంచిన లడ్డూలను సైతం భక్తులకు అందించడంతో అయిపోయాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా తయారైన లడ్డూలు నేరుగా కౌంటర్లకు తరలించి తడిగా ఉన్న ప్రసాదాలనే భక్తులకు అందజేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఐదు లక్షల లడ్డూలు నిల్వ ఉంచడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. దీంతో భక్తులకు అదనంగా జారీచేసే లడ్డూపడి టిక్కెట్లను కుదించారు. ఆదివారం ఉదయం నుంచి ఒకరికి నాలుగు లడ్డూల స్థానంలో రెండింటినే జారీ చేస్తున్నారు. దీనిపై కొందరు భక్తులు కౌంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరికొందరు టీటీడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సంబంధిత అధికారులు లడ్డూ కౌంటర్ల ప్రాంతానికి చేరుకుని భక్తులకు సమస్యను వివరించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ లడ్డూ టోకన్ల కుదింపు విషయాన్ని ముందుగానే మైకుల ద్వారా, కౌంటర్ వద్ద సిబ్బందిచే భక్తులకు తెలియజేసి ఉంటే వ్యతిరేకత ఎదురయ్యేది కాదు.
Sunday, October 7, 2012
Saturday, October 6, 2012
పాదయాత్ర లో చంద్రబాబు వెంట పరిటాల శ్రీరామ్
టీడీపీ నేత పరిటాల రవిని హత్య చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా...మీ కోసం కార్యక్రమంలో భాగం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఐదో రోజు చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలను హెచ్చరించారు. పేదలకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు వెంట రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఉన్నారు.
Friday, October 5, 2012
జనం చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్...ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
'వస్తున్నా . . . మీకోసం' పాదయాత్రలో చంద్రబాబుకు జనం నుంచి వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అనంతపురం జిల్లా ఉరకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. రొద్దం మండలం రాగిమేకలపల్లి వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటారని తెలిసిందన్నారు. ఆయన సుదీర్ఘ యాత్రకు భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారిని ఓదార్చడానికి చంద్రబాబు పాదయాత్ర చేపట్టారన్నారు. ఆయనను స్వాగతించాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టాలనే ఆలోచన మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ద్వారా చంద్రబాబు యాత్రను అడ్డగించి ఇబ్బంది కలిగించేలా మంత్రి, ఎంపీ కుట్ర పన్నుతున్నారన్నారు. ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
2013లో రిటైర్మెంట్ ప్లాన్ ...సచిన్ టెండూల్కర్
తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నోరు విప్పాడు. నవంబర్‌లో భవిష్యత్తుపై సమీక్షించుకుంటానని ఆయన అన్నారు. ఓ టెలివిజన్ చానెల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు. "ఇప్పుడు నాకు 39 ఏళ్లు. ఇంకా చాలా క్రికెట్ ఆడుతానని అనుకోవడం లేదు" అని ఆయన అన్నారు. రిటైర్మైంట్ గురించి ఆలోచిస్తున్నారా అని అడిగితే అవునని, ఆ విషయం ఆలోచిస్తున్నానని జవాబిచ్చారు. ఇప్పుడు తనకు 39 ఏళ్ల వయస్సు అని, దాని గురించి ఆలోచించడం అసాధారణమేమీ కాదని, తాను తన హృదయం చెప్పిన మాటే వింటానని, ఇప్పుడు తాను బాగానే ఉన్నట్లు చెబుతోందని, సిరీస్‌కు, సిరీస్‌కు మధ్య ఆలోచించాల్సి ఉంటుందని అన్నాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లాండుతో జరిగే నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తాను ఆడుతానని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు తాను రిటైర్ కావాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు చెప్పారు. నవంబర్‌లో ఆడిన తర్వాత తిరిగి సమీక్షించుకుని అంచనా వేసుకుంటానని అన్నారు.
జగన్ బెయిల్ పై డెడ్‌లైన్
జగన్ కేసుపై సిబిఐకి ఛార్జీషీట్ డెడ్‌లైన్ విధించింది. 2013 మార్చి 31వ తేదిలోగా ఈ కేసును ముగించాలని సిబిఐకి సూచించింది. తరుచూ ఛార్జీషీట్లు వేయవద్దని, ఒక్క ఛార్జీషీట్‌తోనే విచారణ ముగించాలని తెలిపింది. సిబిఐ మరింత సమయం కోరడంతో కోర్టు ఈ డెడ్ లైన్ విధించింది. విచారణ గడువు ముగిసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని జగన్ కు కోర్టు సూచించింది. జగన్ తరఫున గోపాల సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్‌లు, సిబిఐ తరఫున అశోక్ బాన్, మోహన్ పరాశరణ్‌లు కోర్టులో తమ వాదనలు వినిపించారు.
జగన్ సుప్రీం కోర్టులో నో బెయిల్
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆఫ్తాబాలన్, రంజనా దేశాయ్ తో కూడిన డివిజన్ బెంజ్ తిరస్కరించింది. దర్యాప్తు ముగిసేలోపు మళ్లీ బెయిల్ అడగవద్దని కోర్టు ఆదేశించింది. అంతకు ముందు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో హోరా హోరీగా వాదనలు జరిగాయి. జగన్ అరెస్ట్ అక్రమమని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు లాయర్ వాదించారు. సాక్షులను ఏవిధంగాను ప్రభావితం చేయలేదని న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే జగన్ అక్రమాస్తులపై దర్యాప్తుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని, ఇప్పటికే మూడు వేల కోట్ల ఆస్తులను కనిపెట్టామని, ఇంకా వేలాది కోట్ల ఆస్తులను దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, జగన్ సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని లాయర్లు కోర్టులో వాదించారు. సిబిఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
Thursday, October 4, 2012
జగన్ బెయిల్ కోసం గుళ్లలో పూజలు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని, ఆయనకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెయిల్ రావాలని కోరుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా యువజన విభాగం కార్యకర్తలు అరసవల్లి సూర్య నారాయణ దేవాలయంలో గురువారం 1,101 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అర్చన చేయించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద 1,116 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ త్వరలో బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జగన్ క్షేమం కోరుతూ పార్టీ నేతల ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ నుండి మంకమ్మ తోట వరకు పాదయాత్ర చేసి, ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. హైదరాబాదులోని అంబర్ పేట నుండి జిడి కాలనీ వరకు పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 250 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
Subscribe to:
Posts (Atom)