http://apvarthalu.com/

Thursday, November 28, 2013

ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న న్యూస్ ఛాన‌ళ్లు….!



ఇప్పటికే రెండు ప‌దుల సంఖ్య దాటిపోయింది తెలుగులో ఛాన‌ళ్ల నెంబ‌ర్‌. ఇంకా మ‌రిన్ని ఛాన‌ళ్లు రానున్నాయ‌నే ప్రచారం గుబులు పుట్టిస్తోంది. అతి స‌ర్వత్ర వ‌ర్జయేత్ అంటారు. ఇప్పుడు ఈ సూక్తి న్యూస్ ఛాన‌ళ్ల విష‌యంలో నిరూపిత‌మైంది.
ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన న్యూస్ ఛాన‌ళ్లు, ఇప్పుడు మ‌నుగ‌డ కోసం పోరాటం చేస్తున్నాయి. టీవీ9, టీవీ5, ఈటీవీ2,ఎన్ టీవీ, పాక్షికంగా సాక్షి త‌ప్ప మిగ‌తావ‌న్నీ న‌ష్టాల బాట‌లో ఉన్నాయ‌నే మాటే వినిపిస్తోంది. ఉన్న మార్కెట్ ప‌ల్చబ‌డిపోవ‌డంతో, ఆదాయం బాగా త‌గ్గింది. ఇప్పుడు మ‌రిన్ని ఛాన‌ళ్లు వ‌స్తే ప‌రిస్థితి ఏంట‌నేదే మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న.
ఉన్నవి కాక తుల‌సి ఛాన‌ల్ పైప్‌లైన్‌లో ఉంది. అటు ఎక్స్‌ప్రెస్ న్యూస్ దూసుకొచ్చేందుకు సిద్ధమౌతోంది. రాజ్ న్యూస్ వేగం పెంచేందుకు రెడీ అవుతోంది. దీనికితోడు ఒక ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఒక మ్యూజిక్ ఛాన‌ళ్ని కూడా రాజ్ లాంచ్ చేయాల‌నుకుంటోంది. అటు 6టీవీ డిసెంబ‌ర్లో పూర్తి స్థాయి ప్రసారాల‌కు సిద్ధమౌతోంది. ఆర్వీఎస్, ఏపీ 9 లాంటి పేర్లు వినిపిస్తున్నాయి.
స్టార్ 9 టీవీ పేరుతో సెటిలైట్ చ్యానెల్ మరోటి రాబోతుంది. దీని లోగో మంగళవారం లాంచ్ చేశారు. ఇకపోతే బీసీ పేపర్గా ముద్రవేసుకున్నసూర్య పత్రిక కూడా సెటిలైట్ టీవీ రంగంలోకి సూర్య9 పేరుతో భారీ లాంచింగ్ కి ఏర్పాటులు చేసుకుంటుంది. విశ్రాంత ఐజీ నేతృత్వంలో మరో సెటిలైట్ చ్యానెల్ తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతునాయని సమాచారం. ఇవన్ని 2014 ఎన్నికలను తమ లాంచింగ్ ప్యాడ్గా వాడుకోవాలని చూస్తున్నవే. ఇప్పటికే మార్కెట్లోకి రావలసిన టీవీ99 సన్నాహా కార్యక్రమాలు ముగించికుని ఎన్నికలముందే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా స్వాతి న్యూస్ పేరుతో వ్యాన్లు తిరుగుతున్నాయి. రిక్రూట్‌మెంట్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అటు బ్రేకింగ్ న్యూస్ అనే ఛాన‌ల్ కూడా మొద‌లౌతుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జీ 24 గంట‌లు మూసుకోగా, మ‌హా న్యూస్, హెచ్ఎంటీవీలు ముక్కుతూ మూల్గుతూ న‌డుస్తున్నాయి. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త ఛాన‌ళ్లు వ‌స్తే ప‌రిస్థితేంట‌నేది ఊహించుకోవ‌డానికి భ‌య‌మేస్తోంది.
పుట్టగొడుగుల్లా ఛాన‌ళ్లు పుట్టుకొస్తుంటే, జ‌ర్నలిస్టుల జీవితాలు బాగుప‌డ‌తాయ‌నుకోవాలా లేక మ‌రింత సంక్షోభంలో ప‌డ‌తాయ‌ని బాధ‌ప‌డాలో అర్ధంకాని ప‌రిస్థితి.

No comments: