http://apvarthalu.com/

Thursday, September 27, 2012

రాహుల్‌కు మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తా...ప్రధాని

కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రివర్గంలోకి రావడాన్ని తాను స్వాగతిస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. రాహుల్‌కు తన ఆహ్వానం ఎప్పుడూ ఉంటుందని, ప్రభుత్వంలో చేరాలని ఇప్పటికే పలుమార్లు ఆయన్ను కోరానని శనివారమిక్కడి రాష్ట్రపతి భవన్‌లో మీడియాతో అన్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ పెద్దపాత్ర పోషించేం దుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల రాహుల్ పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ అటు కేంద్ర మంత్రిగా, ఇటు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఇప్పటికే గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ వం టి నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతూనే.. కేంద్ర మంత్రులుగా ఉన్న సంగతిని కాంగ్రెస్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవాలని వారు కోరుతున్నారు. పార్టీ ఉపాధ్యక్ష పదవి లేదా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఆశిస్తున్నారు.

Wednesday, September 26, 2012

తెలంగాణ ఎక్కడ ఉందో 30న తెలుస్తుంది

 తెలంగాణ ఎక్కడుందో కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 30న ప్రజలు చూపిస్తారని బిజెపి ఎంపి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మోసపోతారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100రోజులలోనే తెలంగాణ ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలో పోలీసులకు ఇంటలిజెన్స్‌బ్యూరో హెచ్చరికలు

రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇంటలిజెన్స్‌బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. జీవవైవిద్య సదస్సుకు వచ్చే వీవీఐపీలకు హైసెక్యూరిటీ కల్పించాలని తెలిపింది. విదేశీ ప్రతినిధులకు ఒక్కొక్కరికీ బాడీగార్డులను నియామకం జరగనుంది. ఉగ్రవాదులు, ఆందోళనకారులు హింసకు పాల్పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలపై పోలీసులకు ఐబీ సూచనలు జారీ చేసింది.

సీఎంని గొర్రెల కాపరితో పోల్చిన లగడపాటి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపి లగడపాటి రాజగోపాల్ గొర్రెల కాపరితో పోల్చారు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం జయంతి గ్రామంలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి 9 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఒకప్పుడు గొర్రెల కాపరి అని తెలిపారు. గొర్రెలను క్రమశిక్షణలో పెట్టి సక్రమంగా నడిపించారన్నారు. సీఎం కిరణ్ కూడా అలాగే మన రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తారన్నారు.

Friday, September 21, 2012

అల్లు అర్జున్ సరసన కాజల్ లవ్ స్టోరీ


                                  
రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్య 2 చిత్రంలో ఈ జంట రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఈ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఈ జంట మద్య లవ్ స్టోరీని బాగా పండించటానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ పదిహేను నిముషాలు పాటు ఉంటుందని అంటున్నారు. ఓ పాట, రెండు ఫైట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఆ లవ్ స్టోరీ చాలా స్పీట్ గా నడిపి కథకు కీలకంగా మార్చనున్నారని తెలుస్తోంది. దాన్ని బేస్ చేసుకునే సినిమా మొత్తం నడుస్తుందంటున్నారు.

Thursday, September 20, 2012

పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తా...శేఖర్ కమ్ముల


దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా మేకింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. ఇటీవల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన శేఖర్ కమ్ముల అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని స్పష్టం చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...‘నా ఫేవరెట్ హీరో చిరంజీవి. పవన్ కళ్యాణ్ నాకు అందనంత ఎత్తులో ఉన్నారు. పవన్ అంటే నాకు ఎంతో ఇష్టం అతనితో సినిమా చేయాలని ఉంది. నాకు అవకాశం వస్తే ఎప్పటికైనా తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా' అని వెల్లడించారు.

సింహవాహనంపై మురిపించిన శ్రీనివాసుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేంకటేశ్వర స్వామి సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం స్వామివారి ఉత్సవర్లయిన మలయప్పకు విశేష సమర్పణ గావించారు. అనంతరం స్వామివారు వాహనమండపానికి వేంచేశారు. అక్కడ వజ్రవైఢూర్యాలతో అలంకార శోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి సింహవాహనాన్ని అధిరోహించారు. మృగరాజైన సింహాన్ని లోబరుచుకుని వాహనం చేసుకున్న ఆనందంతో యోగముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీ«ధులలో రెండు గంటలపాటు సాగిన స్వామివారి ఊరేగింపు భక్తులను తన్మయులను చేసింది. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామికి, దేవేరులు శ్రీదేవి,భూదేవిలకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. ఉత్సవర్లకు విశేష సమర్పణ నిర్వహించారు. రాత్రి 9 గంటకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.