http://apvarthalu.com/

Wednesday, October 31, 2012

తమిళనాడును వణికిస్తున్న నీలం తుపాను

నీలం తుపాను తమిళనాడును వణికిస్తోంది. నీలం మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. చెన్నైకి సుమారు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు, కడలూరు మధ్య చెన్నైసమీపంలో బుధవారం సాయంత్రం తీరం దాటింది, తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి, అలలు రెండు మీటర్లకు పైగా ఎగిసిపడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావిత తీరం వెంబడివున్న లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్‌ చేసింది. కాగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మహాబలిపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ విపత్తు నివారణ సంస్థ, సైన్యం సిద్దంగా ఉంది. 

Tuesday, October 30, 2012

500 కిలోమీటర్ల దాటిన చంద్రబాబు పాదయాత్ర

వస్తున్నా... మీకోసం పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 28వ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరులో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడంలేదని, రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తుదని ఆయన విమర్శించారు. ఇది పనికిమాలని ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాలను కట్టవద్దని, తాము అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో కరువు వచ్చినా రైతులకు విద్యుత్ సరఫరా చేశామని ఆయన చెప్పారు. రైతుల కష్టాలు చూస్తేంటే గుండె తరుక్కుపోతుందని, ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి రాగానే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి ప్రకటించారు. చంద్రబాబు పాదయాత్ర మంగళవారం 500 కిలోమీటర్ల మైలురాయి దాటింది.

తుపాన్‌గా మారిన వాయుగుండం


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుపాన్‌గా మారింది. దీనిని 'నీలం'గా చెన్నై వాతావరణ కేంద్రం ఖారారు చేసింది. తుపాన్ చెన్నైయ్‌కు ఆగ్నేయంగా500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సముద్రంలో అలల ఉధృతి పెరింగింది. గంటకు సుమారు 45 నుంచి 60 కిలోమీటర్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావంతో తమిళనాడులో, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు - నాగపట్నం మధ్య బుధవారం రాత్రి లోగా తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్‌ నవంబరు 2 నాటికి అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైబడి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వచ్చే 48 గంటలు సముద్రం కల్లోలంగా ఉంటుందని, మరోవైపు చెన్నై పోర్టులో అధికారులు ఏడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నాగపట్నం, తూతుకూడి, కారేకల్ పోర్టుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీగా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత తీరం దిశగా వచ్చేసరికి గాలుల తీవ్రత పెరుగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తీరప్రాంత జిల్లాల్లో అలజడి మొదలైంది. కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడ రేవుల్లో ఇప్పటికే మూడో నెంబరు ప్రమాదహెచ్చరిక ఎగరేయగా, తమిళనాడులోని పలు తీర ప్రాంతాల్లో నాలుగోనెంబరు హెచ్చరిక ఎగరేశారు. తుఫానుగా మారే వాయుగుండం నెల్లూరు- నాగపట్నం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరిగింది. అల్లూరు మండలం ఇస్కపాళెం వద్ద తుఫానుషెల్టర్ కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు వీస్తున్నాయి.

నవంబర్ 1ని బహిష్కరించండి

నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించి, విద్రోహదినంగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకటో తేదీన తెలంగాణ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేయాలని ఆయన తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులను సూచించారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో నిరసన తెలపాలని తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.

Saturday, October 27, 2012

చంద్రబాబును పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్

 గద్వాల్ సభలో శుక్రవారం రాత్రి గాయపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఉదయం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 'బాద్ షా' చిత్రం షూటింగ్‌ను ఎన్టీఆర్ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ శనివారం ఉదయం గద్వాల్‌కు బయలుదేరి వెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా శెట్టి ఆత్మకూరులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ సభావేదిక కూలి గాయపడిన మామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చానని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టిలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు. షూటంగ్ తేదీలను వెసులుబాటు చూసుకుని తాను కూడా బాబు పాదయాత్రలో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

మహిళలతో షర్మిల రచ్చబండ

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పదవరోజు జిల్లాలోని గొల్లపల్లిలో షర్మిల శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బడంగపల్లి చేరుకున్న షర్మిల అక్కడి వేరుశనగ పంటలు పరిశీలించి రైతుల కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనంతరం శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుడంగపల్లెలోని మహిళలతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ సీఎం భార్య కూడా 3 కిలోమీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుంటే తప్ప ప్రజలు బాధలు తెలుసుకోలేరని విమర్శించారు. అక్కడ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి నిక్షేపంగా ఉన్నారని, ఇక్కడ మాత్రం ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Saturday, October 13, 2012

నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల సమ్మె

 విద్యుత్ కోతలతో పెట్రోలు బంకుల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ రాజీవ్ అమరం పేర్కొన్నారు. చమురు కంపెనీలు కమీషన్ పెంచేందుకు ముందుకు రాకపోవడంతో ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు శనివారం విలేకరులకు తెలిపారు. సమ్మె రోజుల్లో ఒక్క షిఫ్ట్‌లో మాత్రమే పెట్రోలు బంకుల్లో విక్రయాలుంటాయని ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అవుట్‌లెట్‌లు పనిచేస్తాయని తెలిపారు. హైవేలోని అవుట్‌లెట్లలో రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకే అమ్మకాలు ఉంటాయన్నారు.