వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం సాయంత్రం స్పష్టం చేశారు. 'మరో ప్రస్థానం' పేరుతో కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుందని విజయమ్మ వెల్లడించారు. సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా యాత్ర సాగుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు బాసటగా నిలువాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టినందున షర్మిలా పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు. మహానేత ప్రజల దగ్గరికి ఎలా వచ్చారో, ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో అదే విధంగా వైఎస్ స్పూర్తితో పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. పాదయాత్ర అక్టోబర్ 18 తేదిన వైఎస్ఆర జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగుతుందని అన్నారు.
Thursday, October 11, 2012
Wednesday, October 10, 2012
జగన్ పార్టీలోకి మోహన్ బాబు !
కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన చర్యలను చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మోహన్ బాబు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కొద్ది నెలలుగా ఆయన తాను తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెబుతూ వచ్చారు. ఆయన పొలిటికల్ రీఎంట్రీపై మాట్లాడగానే తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. తన గురువు దాసరి నారాయణ రావుకు ప్రాధాన్యత కల్పించడం, చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన నేపథ్యంలో మోహన్ బాబు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసులో చేరే అవకాశాలు లేవని తొలి నుండి అందరూ భావించిన విషయమే.
తన విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును చాలాకాలం తర్వాత ఆహ్వానించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. టిడిపిలో చేరేందుకు మోహన్ బాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండుసార్లు చంద్రబాబుకు తనకు మధ్య చిన్న మనస్పర్థలు మాత్రమేనని, ఆయన పాలన బావుందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా అవినీతిలేని పార్టీలో చేరతానని, జర్నలిస్టులు ఏదో సూచించాలని కోరారు. అప్పటికే జగన్ పార్టీకి అవినీతి మచ్చ పడ్డ నేపథ్యంలో మోహన్ బాబు ఖచ్చితంగా టిడిపిలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అనూహ్యంగా మోహన్ బాబు ఇంటికి జగన్ రావడం, ఆ తర్వాత ఓసారి జైలులో కూడా తన తనయుడు విష్ణుతో కలిసి మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతను కలవడం మరోసారి చర్చకు దారితీశాయి. అప్పుడు జగన్‌కు అనుకూలంగా మాట్లాడారు. రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ బయటకు వస్తాడని, ఏ తప్పు చేయలేదని చెప్పారు. దీంతో మోహన్ బాబు టిడిపిపై యూ టర్న్ తీసుకున్నట్లుగా అర్థమైపోయింది. తాజాగా మోహన్ బాబు తనయుడు విష్ణు హీరోగా వస్తున్న ఓ చిత్రం జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
Monday, October 8, 2012
16 ఏళ్ల రాగానే పెళ్లి చేయండి!
ఇటీవల హర్యానాలో రేప్ కేసుల సంఖ్య పెరగడంతో దానికి అక్కడి కాప్ పంచాయత్ పెద్దలు వింత పరిష్కారం చూపారు. యువతీయువకుల పెళ్లి వయస్సు తగ్గించి, వారికి 16 ఏళ్లకే పెళ్లి చేయాలని అప్పుడే అత్యాచార కేసులు తగ్గుముఖం పడతాయంటూ కొత్తభాష్యం చెప్పారు. అత్యాచారానికి గురైన ఓ దళిత బాలిక కొద్దిరోజులక్రితం నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెలరోజుల్లో ఇలాంటివి 12 సంఘటనలు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సైతం జోక్యం చేసుకుని హర్యానా ప్రభుత్వానికి తలంటింది.
మరోవైపు ఈ ఘటనల వెనుక కుట్ర దాగుందని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాప్ పెద్దలు తమదైన శైలిలో పరిష్కార మార్గం చెప్పారు. ‘‘16 ఏళ్లు రాగానే యువతీయువకులకు పెళ్లి చేస్తే.. వారు తప్పుదోవపట్టరు. తద్వారా రేప్ కేసులూ తగ్గుముఖం పడతాయి’’ అని ఓ కాప్ పెద్ద పేర్కొనగా.. రజస్వల కాగానే ఆడపిల్లకు పెళ్లి చేయాలని మరో పెద్దమనిషి ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు వరుస సంఘటన లపై హర్యానా ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఇందులో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేసింది. పలువురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని ప్రకటించింది. అయితే సర్కారు నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
Sunday, October 7, 2012
తిరుమలలో శ్రీవారి లడ్డూల కొరత
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కొరత ఏర్పడింది. దీంతో అదనపు లడ్డూ టోకన్లను టీటీడీ కుదించింది. వారం రోజులుగా తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీకి తగట్టుగా లడ్డూ ప్రసాదాలను అందించారు. రోజువారి తయారీతో పోలిస్తే భక్తులకు పంపిణీ చేసిన లడ్డూలే అధికంగా ఉంది. దీంతో ఆలయ పోటులో నిల్వ ఉంచిన లడ్డూలను సైతం భక్తులకు అందించడంతో అయిపోయాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా తయారైన లడ్డూలు నేరుగా కౌంటర్లకు తరలించి తడిగా ఉన్న ప్రసాదాలనే భక్తులకు అందజేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఐదు లక్షల లడ్డూలు నిల్వ ఉంచడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. దీంతో భక్తులకు అదనంగా జారీచేసే లడ్డూపడి టిక్కెట్లను కుదించారు. ఆదివారం ఉదయం నుంచి ఒకరికి నాలుగు లడ్డూల స్థానంలో రెండింటినే జారీ చేస్తున్నారు. దీనిపై కొందరు భక్తులు కౌంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరికొందరు టీటీడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సంబంధిత అధికారులు లడ్డూ కౌంటర్ల ప్రాంతానికి చేరుకుని భక్తులకు సమస్యను వివరించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ లడ్డూ టోకన్ల కుదింపు విషయాన్ని ముందుగానే మైకుల ద్వారా, కౌంటర్ వద్ద సిబ్బందిచే భక్తులకు తెలియజేసి ఉంటే వ్యతిరేకత ఎదురయ్యేది కాదు.
Saturday, October 6, 2012
పాదయాత్ర లో చంద్రబాబు వెంట పరిటాల శ్రీరామ్
టీడీపీ నేత పరిటాల రవిని హత్య చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా...మీ కోసం కార్యక్రమంలో భాగం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఐదో రోజు చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలను హెచ్చరించారు. పేదలకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు వెంట రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఉన్నారు.
Friday, October 5, 2012
జనం చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్...ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
'వస్తున్నా . . . మీకోసం' పాదయాత్రలో చంద్రబాబుకు జనం నుంచి వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అనంతపురం జిల్లా ఉరకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. రొద్దం మండలం రాగిమేకలపల్లి వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటారని తెలిసిందన్నారు. ఆయన సుదీర్ఘ యాత్రకు భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారిని ఓదార్చడానికి చంద్రబాబు పాదయాత్ర చేపట్టారన్నారు. ఆయనను స్వాగతించాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టాలనే ఆలోచన మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ద్వారా చంద్రబాబు యాత్రను అడ్డగించి ఇబ్బంది కలిగించేలా మంత్రి, ఎంపీ కుట్ర పన్నుతున్నారన్నారు. ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
2013లో రిటైర్మెంట్ ప్లాన్ ...సచిన్ టెండూల్కర్
తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నోరు విప్పాడు. నవంబర్‌లో భవిష్యత్తుపై సమీక్షించుకుంటానని ఆయన అన్నారు. ఓ టెలివిజన్ చానెల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు. "ఇప్పుడు నాకు 39 ఏళ్లు. ఇంకా చాలా క్రికెట్ ఆడుతానని అనుకోవడం లేదు" అని ఆయన అన్నారు. రిటైర్మైంట్ గురించి ఆలోచిస్తున్నారా అని అడిగితే అవునని, ఆ విషయం ఆలోచిస్తున్నానని జవాబిచ్చారు. ఇప్పుడు తనకు 39 ఏళ్ల వయస్సు అని, దాని గురించి ఆలోచించడం అసాధారణమేమీ కాదని, తాను తన హృదయం చెప్పిన మాటే వింటానని, ఇప్పుడు తాను బాగానే ఉన్నట్లు చెబుతోందని, సిరీస్‌కు, సిరీస్‌కు మధ్య ఆలోచించాల్సి ఉంటుందని అన్నాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లాండుతో జరిగే నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తాను ఆడుతానని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు తాను రిటైర్ కావాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు చెప్పారు. నవంబర్‌లో ఆడిన తర్వాత తిరిగి సమీక్షించుకుని అంచనా వేసుకుంటానని అన్నారు.
Subscribe to:
Posts (Atom)