ఇటీవల హర్యానాలో రేప్ కేసుల సంఖ్య పెరగడంతో దానికి అక్కడి కాప్ పంచాయత్ పెద్దలు వింత పరిష్కారం చూపారు. యువతీయువకుల పెళ్లి వయస్సు తగ్గించి, వారికి 16 ఏళ్లకే పెళ్లి చేయాలని అప్పుడే అత్యాచార కేసులు తగ్గుముఖం పడతాయంటూ కొత్తభాష్యం చెప్పారు. అత్యాచారానికి గురైన ఓ దళిత బాలిక కొద్దిరోజులక్రితం నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెలరోజుల్లో ఇలాంటివి 12 సంఘటనలు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సైతం జోక్యం చేసుకుని హర్యానా ప్రభుత్వానికి తలంటింది.
మరోవైపు ఈ ఘటనల వెనుక కుట్ర దాగుందని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాప్ పెద్దలు తమదైన శైలిలో పరిష్కార మార్గం చెప్పారు. ‘‘16 ఏళ్లు రాగానే యువతీయువకులకు పెళ్లి చేస్తే.. వారు తప్పుదోవపట్టరు. తద్వారా రేప్ కేసులూ తగ్గుముఖం పడతాయి’’ అని ఓ కాప్ పెద్ద పేర్కొనగా.. రజస్వల కాగానే ఆడపిల్లకు పెళ్లి చేయాలని మరో పెద్దమనిషి ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు వరుస సంఘటన లపై హర్యానా ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఇందులో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేసింది. పలువురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని ప్రకటించింది. అయితే సర్కారు నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.