http://apvarthalu.com/

Sunday, September 30, 2012

భాగ్యనగరం రణరంగమైంది

భాగ్యనగరం రణరంగమైంది. పోలీసుల తూటాలు, లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాలు లెక్క చేయకుండా, బారీకేడ్లను తొలగించి, ముళ్లకంచెలపై నుండి దూకి తెలంగాణవాదులు చీమలదండులా సాగర హారానికి తరలి వచ్చారు. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు సాగర్‌ను వదిలేది లేదని ఖరాఖండిగా చెప్పారు. తాము శాంతియుతంగా కవాతు చేయడానికి సిద్ధమైనతే పోలీసులు తమపై నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని, తెలంగాణవాదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినప్పటికీ తెలంగాణవాదులు ఎలాంటి హింసామార్గాన్ని చేపట్టకుండా లక్షలాదిగా తరలి వచ్చారని అంటున్నారు. జనసాగరంగా మారిన సాగరహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ... తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు నెక్లెస్ రోడ్డు కవాతుకు తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలు, ప్రజా సంఘాలు ఇలా ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణవాదులు సాగర తీరానికి చేరుకున్నారు. నెక్లెస్ రోడ్డు, పివి ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ అన్నీ ఇసుక వేస్తే రాలనంతగా మారాయి. నేల ఈనిందా అన్న మాదిరిగా నెక్లెస్ రోడ్డు తెలంగాణవాదులతో నిండిపోయింది. నగరం మొత్తం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మూడు గంటలకే ప్రారంభమవుతుందనుకున్న సాగరహారం అరెస్టులు, నిర్బంధాల కారణంగా రెండున్నర, మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అంతకుముందు వివిధ జిల్లాల నుండి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్టులను పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. అరెస్టులను నిరసిస్తూ తెరాస ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిశారు. టిటిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో రెండుసార్లు అరెస్టయ్యారు. సొంత పార్టీ నేతల నుండి కిరణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కిరణ్, డిజిపి వైఖరిపై నిప్పులు చెరిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఓ అడుగు ముందుకేసి... తెలంగాణవాదులను రెచ్చగొడితే తాము పదవులను త్యజించడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. మధ్యాహ్నం అనుకున్న సమయానికి ఆయా పార్టీలు, ప్రజా సంఘాల ర్యాలీలు నిర్దేషిత ప్రాంతాల నుండి ప్రారంభమయ్యాయి. పోలీసులు ర్యాలీలను ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. పోలీసులు, తెలంగాణవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణవాదులు బారీకేడ్లు తొలగించి, ముళ్లకంచెలు పెకిలించి వేదిక వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణవాదులు కూడా పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీడియా ఓబి వ్యాన్లకు, నెక్లెస్ రైల్వే స్టేషన్‌కు, రెండు పోలీసు జీపులకు నిప్పు అంటించారు. సాయంత్రం కవాతు వేదిక వద్దకు వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తదితరులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులపై తెలంగాణవాదులదే పైచేయి అయింది. ఎక్కడికి అక్కడ పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కాలు కాలు కదిపి కదం తొక్కారు. డిజిపి దినేష్ రెడ్డి నగరంలో ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. తూటాలకు వెన్నుచూపని ఓయు విద్యార్థులు! కవాతు నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రణరంగమైంది. ఓయు విద్యార్థులు బైక్ ర్యాలీతో కవాతు వేదిక వద్దకు బయలుదేరారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకొని ముందుకు కదలనివ్వలేదు. తాము బైక్ ర్యాలీతోనే వెళ్తామని విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులు కూడా అంతే ధీటుగా పోలీసుల పైకి రాళ్ల వర్షం కురిపించారు. శాంతియుతంగా కవాతు చేస్తామని.. అనుమతిస్తే మంచిదని లేకుంటే తాము అదే తీరుగా స్పందిస్తామని పోలీసులు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ విద్యార్థికి రబ్బరు తూటా తగిలి గాయమైంది. తూటా తగిలినా, బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ విద్యార్థులు వెనుకంజ వేయలేదు. నెక్లెస్ రెడ్డు తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతరను తలపించింది.

Saturday, September 29, 2012

హైదరాబాద్ గణనాథునికి ఘన వీడ్కోలు

 హైదరాబాద్ నగరం భక్తజన సంద్రంగా మారింది. ఎటు చూసినా గణేశ్ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తజనం నామస్మరణ. ఒకవైపు చిరుజల్లులతో మొదలైన వర్షం జోరుగా కురిసినా.. భక్తకోటి ఉత్సాహాన్ని అది అడ్డుకోలేకపోయింది. 11 రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడికి భక్తులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చ రిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా రాత్రి ఒంటిగంట లోపే ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తయింది. రాత్రి 11 గంటల సమయానికి 4,350 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12-1 మధ్య మొత్తం విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా, కూకట్‌పల్లి, ఐడీపీఎల్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జన పర్వం కొనసాగింది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేశ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అత్తాపూర్‌లో హైటెన్షన్ తీగలకు జెండా తగిలి విద్యుదాఘాతంతో ఆరుగురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగా జరిగిన నిమజ్జనం సాయంత్రానికి ఊపందుకుంది.

దేశంలో పెరిగిపోయిన అవినీతి

దేశంలో అన్ని విభాగాల్లో అవినీతి పెరిగిపోయిందని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లోని రెవెన్యూ కళ్యాణమండపంలో శనివారం జరిగిన అంతర్జాతీయ సహకార దినోత్సవ సభలో మంత్రి ప్రసంగించారు. జీడీసీసీబీ ఛైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కాసు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేశంలో ఎక్కువ మందికి సహకార రంగంతో ప్రమేయం ఉందన్నారు. ఈ రంగం పటిష్టంగా ఉంటే పేద వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సహకార వ్యవస్థను పటిష్టపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

Thursday, September 27, 2012

వస్తున్నా మీకోసం: బాబు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు


అక్టోబర్ 2వ తారీఖు నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోయే పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ ఖరారైంది. అనంతపురం జిల్లా హిందూపురం నుండి బాబు తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. స్థానికంగా ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేస్తారు. చంద్రబాబు నిర్వహించే ఈ పాదయాత్రకు వస్తున్నా మీకోసం అనే పేరును పెట్టారు. హిందూపురం నుండి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రాప్తాడు, పెనుగొండ, గుత్తి మీదుగా కర్నూలులోకి ప్రవేశిస్తుంది. అనంతలో 13 రోజులు పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 117 రోజులు రోజుకు సుమారు 15 కి.మీ. నుండి 20 కి.మీ. వరకు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రబాబు ఆరవై నాలుగేళ్ల వయస్సులో కూడా ప్రజల కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. టిడిపి తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, దీనిని ప్రజలకు తెలియజేస్తామని, బాబుకు విల్ పవర్ ఉంద్నారు.
చంద్రబాబు అంతకుముందు అదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుండి లేదా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుండి పాదయాత్ర చేపట్టాలని చూశారు. కొడంగల్ నుండి దాదాపు సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో అది కూడా రద్దయింది. ఈరోజు అధికారికంగా హిందూపురం నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కాగా బాబు పాదయాత్ర కోసం సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, హరిరామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ రాసిన పాటలకు వందేమాతరం శ్రీనివాసం సంగీతం అందించారు. అన్నా స్టూడియోలో రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. బాబు మార్చింగ్ పైన, బాబు వస్తున్నాడని ఇలా అర్థం వచ్చేట్టు పాటలను రాశారు.



బాబు లేఖ పెద్ద డ్రామా... గంటా

ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖ పెద్ద డ్రామా అని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ బాక్సైట్ త్రవ్వకాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. వారి అభిప్రాయాలను గౌరవించాల్సిందే అని ఆయన అన్నారు. విశాఖలో హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో 144 సెక్షన్

ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. నగరమంతటా నవంబర్ 18 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ సీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలను కూడా ఈ నిషేధాజ్ఞల పరిధిలో చేర్చారు. నగరంలో ఎక్కడా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుపరాదని నిషేధాజ్ఞల్లో పేర్కొన్నారు.

ఓయూలో టెన్షన్...టెన్షన్

 ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా గురువారం ఉదయం కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారకం జలదృశ్యం వద్దకు ఓయూ విద్యార్థి జేఏసీ ర్యాలీ ప్రారంభించారు. అయితే భారీగా పోలీసులు బలగాలు అక్కడకు చేరుకుని విద్యార్థులను అడ్డుకుని బయటకు రాకుండా ఎన్‌సీసీ గేటుకు తాళం వేశారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. పోలీసులు కవాతుకు అనుమతించమని భీష్మించుకు కూర్చున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కవాతును జరిపితీరుతామని గేట్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి తెలంగాణ విద్యార్థుల ఆందోళనతో గురువారం అట్టుడికింది. సచివాలయ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు విశ్వవిద్యాలయం గేటు వద్ద అడ్డుకున్నారు. తాము జలదృశ్యం వరకు వెళ్లి ఇటీవల మరణించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించి వెనక్కి వస్తామని, కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని విద్యార్థులు చెబుతున్నా పోలీసులు వినలేదు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.