http://apvarthalu.com/

Sunday, December 1, 2013

పురంధరేశ్వరి...అన్న బిడ్డవేనా...?

మీరు బాగానే ఉంటార్లెండి. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి. అంతకన్నా ముందు మీరు దేశంలోనే చాలా గుర్తింపు పొందిన మహిళా నేత. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆజ్ఞానుసారం నడుచుకునే క్రమశిక్షణ కలిగిన నేత. ఇక మీకేం సమస్యలుంటాయి. సమస్యలనేవి ఉంటే మాలాంటి వాళ్లకి ఉంటాయిగానీ... అయినా మీరు పెద్ద పెద్ద వేదికలెక్కి, అంతర్జాతీయ సదస్సులకు హాజరై, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేసి ప్రపంచం దృష్టిలో మీరేదో పెద్ద మేధావి కింద లెక్కించబడేసి, గుర్తింపు పొందుతున్నారు. కానీ వీటన్నింటికన్నా ముందు మీకు అతిముఖ్యమైన, గొప్పదైన, మీజీవితానికి చిరస్థాయిగా మీతో ఉండే గుర్తింపు ఒకటుంది. అదేమిటో తెలుసా... స్వర్గీయ ఎన్టీరామారావు కుమార్తె. ఆయన కుమార్తెగానే ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని గుర్తిస్తున్నారు. ఆ ఒక్క ‘డిగ్రీ’ తీసి పక్కనపెడితే ప్రజల దృష్టిలో మీవిలువ పూచికపుల్ల కంటె ఎక్కువ ఎంతమాత్రమూ కాదనే సత్యం తమకు బాగా తెలుసు. రామారావులాంటి గొప్ప వ్యక్తి... తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించి పార్టీపెట్టి అప్పట్లో దేశం మొత్తాన్ని శాసించే కాంగ్రెస్‌ పార్టీ వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టించాడు. పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీని ఢీకొనగలిగే సత్తావున్న తొలి ప్రాంతీయ పార్టీగా ఆయన పెట్టిన పార్టీ నిలిచింది. ఇలా తెలుగువారికోసం ఆయన ఎంతో పాటుపడ్డారు. కానీ మీరు ఏం చేస్తున్నారు...? రామారావు తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని మనసారా కోరుకున్నారు. ఆయన ఏది చెప్పినా ఒకే మాటగా ఉండేది. కానీ మీరు మాత్రం తెలుగువారిని ముక్కలు చేయడానికి మీ శాయశక్తులా కృషి చేస్తున్నారు. మీవంతు చేయగలిగినంతా చేస్తున్నారు. పైగా ప్రతిసారీ ఒకదానికి ఒకటి పొంతనలేకుండా స్టేట్‌మెంట్లు ఇస్తూ, మీ వాదనకు ‘సమైక్య’వాదం మసిపూసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. తమరు తండ్రిగారు అనగా, తెలుగుజాతికి అన్న అయిన తారకరాముని జీవితంలో ఎన్నడూ జనాన్ని వంచించడం అనే పనిచేసి ఎరగరు. అయితే మీకు ఆ బుద్ధి అంత సునాయాసంగా ఎలా అబ్బినదో మాత్రం అర్థం కావడం లేదు. కేంద్ర మంత్రులంతా రాజీనామాలు చేయండి, అప్పుడు రాష్ట్రం ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉంటుందని ప్రజలు మిమ్మల్ని కోరినప్పుడు మీరేమన్నారు... ‘మేం పదవుల్లో ఉంటేనే అప్రోచ్‌ ఉంటుంది. అప్రోచ్‌ ఉంటేనే మన డిమాండ్లను సాధించుకోవచ్చు’ అన్నావు. కానీ ఇప్పటిదాకా మీరు పదవిలో ఉండి ఏం అప్రోచ్‌ సాధించారో ప్రజలకు అర్ధం కావడంలేదు. మళ్లీ మరోసారి రాష్ట్రం ముక్కలు కావడం ఇక ఆగదు, అలాంటప్పుడు మనకు కావాల్సిన వాటిని డిమాండ్‌ చేసి రాబట్టుకుందాం... అంటూ మాట్లాడారు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకమైన వ్యాఖ్యలను చేస్తూ నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. పైకి మాత్రం మేమంతా కూడా సమైక్యంగా ఉండాలనే మనసులో కోరుకుంటున్నాం... కానీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడచుకోవాలి, కాబట్టి ఏం చేయలేకున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఇదంతా కేవలం మీ మంత్రి పదవిని కాపాడుకోవడానికి, మీ రాజకీయ లబ్దికోసమే చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒక్కటిమాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంది. ఇప్పుడు మీ స్వార్థం కోసం మీ చిత్తం వచ్చినట్టుగా ప్రవర్తించినా, తర్వాత కాలంలో మీకున్న ఆ ‘గొప్ప డిగ్రీ’ని కూడా పక్కనపెట్టి ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారు. ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడుతూ ప్రజల్ని మోసం చేస్తున్న విషయాన్ని వారుకూడా గమనిస్తున్నారు. దీనికి బదులు చేయాలని కూడా ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఇక ఏ అధిష్టానం మీమ్మల్ని కాపాడదనే విషయాన్ని మీరు గుర్తిస్తే మంచిది.






























































No comments: