http://apvarthalu.com/

Wednesday, October 3, 2012

క్రికెటర్ల గదుల వద్ద అమ్మాయిల అరెస్ట్!

వెస్టిండీస్ క్రికెటర్ల గదుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ముగ్గురు బ్రిటన్ జాతీయ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లోని విండీస్ క్రికెటర్ల గదుల్లోకి అనధికారికంగా వెల్లడానికి ప్రయత్నించడంతో మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం సిన్నమోన్ గార్డెన్ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శుక్రవారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ట మధ్య మ్యాచ్ జరుగుతుండగా చోటుచేసుకుంది.

తెలంగాణపై ఇప్పట్లో రాదు...మంత్రి టీజీ

 ప్రత్యేక తెలంగాణపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశంలేదని మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ 2014 సాధారణ ఎన్నికలకు ఆరె నెలల ముందు తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వెలువడనుందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్ఠానం కోర్ కమిటీ సభ్యులను కలుస్తామని మంత్రి టీజీ తెలిపారు.

తప్పులు సరిదిద్దుకుని మంచి పాలన అందిస్తా...చంద్రబాబు

తొలిరోజు పాదయాత్రలో జననీరాజనాలు అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజైన బుధవారం కోళ్లకుంటనుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు దాదాపు 18 కి.మీ వరకు పాదయాత్ర సాగనుంది. 8 నుంచి 10 గ్రామాల్లో బాబు పాదయాత్రగా వెళ్లనున్నారు. రెండో రోజు ప్రాదయాత్రలో కూడా బాబు వెంట ఆయన కుమారుడు లోకేష్ నాయుడు ఉన్నారు. బుధావారం ఉదయం హిందూపురం నియోజకవర్గం కోళ్లకుంట నుంచి బాబు పాదయాత్రను ప్రార ంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ టీడీపీ హయాంలో ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్గుకొని మంచి పాలన అందిస్తానని చంద్రబాబు అన్నారు. టిడిపి హయాంలో ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేశామన్నారు. కానీ కాంగ్రెసు పార్టీ నేతలు మాత్రం ప్రజల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పేదవారికి న్యాయం జరగాలనే తాను ఈ యాత్రను చేపట్టానని తెలిపారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సమ న్యాయం జరగాలన్నారు. కానీ కాంగ్రెసు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, దానిని విదేశాలలో దాచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పేదవారికి ఆర్థిక స్వాతంత్ర్యం రావాలన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం తినే తిండి పైన, కట్టుకునే బట్టల పైనా 14 శాతం పన్ను విధించిందని విమర్శించారు.

Monday, October 1, 2012

'గుండెల్లో గోదారి' ఫొటోఫై చర్యలు తీసుకుంటాం... మంచు లక్ష్మీప్రసన్న


 మలయాళంలో మమ్ముట్టి, తాప్సీ నటించిన డబుల్స్ అనే చిత్రాన్ని తమిళంలో ‘పుదువై మనగరమ్' పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ‘గుండెల్లో గోదారి'లోని తాప్సీ ఫొటోలను వినియోగిస్తున్నారని, ఇది అభ్యంతరకరమని లక్ష్మీ చెబుతూ, ఈ విషయాన్ని తమిళనాడు నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఆ సినిమా ప్రచారం కోసం 'గుండెల్లో గోదారి'లోని తాప్సి ఫొటోలను వాడుకుంటున్నారు. ''ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడము'' అన్నారు లక్ష్మీ ప్రసన్న.గుండెల్లో గోదారి ఓ సాహసోపేతమైన ప్రేమకథ. వాస్తవ సంఘటన ఆధారంగా అల్లుకొన్నాము. 1980 కాలంలో నడిచే కథ ఇది. ఇళయరాజా ఆరు బాణీలను అందించారు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 'సినిమా విడుదలైన తరవాతే ఇవ్వు' అన్నారు. ఆ మాట ఎంతో సంతోషాన్నిచ్చింది' 'అని ఆమె చెప్పారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో పాటల్ని, నవంబరు మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తారు.

బాబు యాత్ర ఎందుకో తెలియదు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో తనకు తెలియదని రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి పెనుకొండకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబు పా దయాత్రపై మీ స్పందన ఏమిటంటూ విలేఖరులు అడగటంతో పైవిధంగా స్పందించారు.

చంద్రబాబుకు కలిసిరాని కాలం!


 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుచంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసిరావడంలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది మొదలు పెట్టినా బెడిసికొడుతోంది. ఆయన విధానాలన్నీ తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ప్రత్యర్థులేకాదు సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ బలహీనపడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హర్షించలేదు. ఇరు ప్రాంతాల వారు విమర్శించారు. తెలంగాణ వారు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పట్ల, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించలేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఏం చేస్తే అది చేసి నవ్వుల పాలయ్యారు. ఆ పార్టీ ధర్నాలు చేస్తే ధర్నాలు, దీక్షలు చేస్తే దీక్షలు చేశారు. ఇప్పుడు ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ కాపీ కార్యక్రమాలే. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు ఇలా చేస్తున్నారేంటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార దాహంతో అర్ధంపర్ధంలేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో టిడిపి పూర్తిగా బలహీనపడింది. ఉప ఎన్నికలలో పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలంగాణపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయమని, ఈ అంశాన్ని త్వరగా తేల్చమని చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడం వివాదాలకు దారి తీసింది. మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనే చిచ్చు రగిల్చింది. ఈ లేఖతో తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు విమర్శించారు. బాబు లేఖల పేరుతో మోసం చేస్తున్నారని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి మండిపడ్డారు. లేఖలో స్పష్టత ఏముందో చెప్పాలని ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. లేఖల రాజకీయంతో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేశారని తెలంగాణవాదులు అంటే, సొంత జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి సీమ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని టిడిపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. పాదయాత్రలో చంద్రబాబును చెప్పులతో అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పి, వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 వరకు తాము వెయ్యి కిలో మీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. తమ యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుందని ఆయన వివరించారు. చంద్రబాబు పాదయాత్రకు సహకరించేది లేదని టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తెగేసి చెప్పారు. లేఖ రాయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బాబు విధానాల వల్ల పార్టీ బ్రష్టుపట్టిపోయిందని అమరనాథ రెడ్డి బాధపడ్డారు. బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బాబు వ్యూహాత్మక తప్పిదాల వల్లే టీడీపీ హీనస్థితికి చేరిందన్నారు. పార్టీని ఆయన అధోగతి పాలు చేశారన్నారు. పార్టీ అధినేత అయిన తననే ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శిస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణలో చూస్తే అలా ఉంది, సీమలో చూస్తే ఇలా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు వలసబాట పట్టారు. 2009 ఎన్నికలలో టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర రెడ్డి, వేణుగోపాల చారి, నాగం జనార్ధన రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డి, కొడాలి నాని, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో ఓటర్లు టిడిపికి చుక్కలు చూపించారు. పరిస్థితి ఇలా ఉన్నా చంద్రబాబుకు ముఖ్యమంత్రి కుర్చీమీద మమకారం చావలేదు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ' రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టేందుకు చరిత్ర తిరగరాయాలని అనుకుంటున్నాను. సమస్యలు చూసి ఓదార్చడం కాకుండా వారిలో చైతన్యం తెచ్చి పరిష్కార దిశగా కృషి చేయాలి. మళ్లీ నేను సీఎంని అవుతాను. మధ్యతరగతిలో పుట్టినప్పటికీ ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాను. మహాత్మాగాంధీ, పూలే, ఎన్టీఆర్ సైతం అలాంటి స్థితిలోనే జన్మించి అనుక్నుది సాధించారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయే అలాంటివారిని ఆదర్శంగా తీసుకొని కృషిచేయాలి’ ' అని చెప్పారు. అంతే కాకుండా ఇటీవల బిసి డిక్లరేషన్, ఎస్ సి డిక్లరేషన్, ముస్లింలకు ఉప ప్రణాళిక....... అని చెబుతున్నారు. పదవీ వ్యామోహం ఆయనతో ఇలా మాట్లాడిస్తోంది.

Sunday, September 30, 2012

భాగ్యనగరం రణరంగమైంది

భాగ్యనగరం రణరంగమైంది. పోలీసుల తూటాలు, లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాలు లెక్క చేయకుండా, బారీకేడ్లను తొలగించి, ముళ్లకంచెలపై నుండి దూకి తెలంగాణవాదులు చీమలదండులా సాగర హారానికి తరలి వచ్చారు. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు సాగర్‌ను వదిలేది లేదని ఖరాఖండిగా చెప్పారు. తాము శాంతియుతంగా కవాతు చేయడానికి సిద్ధమైనతే పోలీసులు తమపై నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని, తెలంగాణవాదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినప్పటికీ తెలంగాణవాదులు ఎలాంటి హింసామార్గాన్ని చేపట్టకుండా లక్షలాదిగా తరలి వచ్చారని అంటున్నారు. జనసాగరంగా మారిన సాగరహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ... తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు నెక్లెస్ రోడ్డు కవాతుకు తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలు, ప్రజా సంఘాలు ఇలా ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణవాదులు సాగర తీరానికి చేరుకున్నారు. నెక్లెస్ రోడ్డు, పివి ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ అన్నీ ఇసుక వేస్తే రాలనంతగా మారాయి. నేల ఈనిందా అన్న మాదిరిగా నెక్లెస్ రోడ్డు తెలంగాణవాదులతో నిండిపోయింది. నగరం మొత్తం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మూడు గంటలకే ప్రారంభమవుతుందనుకున్న సాగరహారం అరెస్టులు, నిర్బంధాల కారణంగా రెండున్నర, మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అంతకుముందు వివిధ జిల్లాల నుండి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్టులను పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. అరెస్టులను నిరసిస్తూ తెరాస ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిశారు. టిటిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో రెండుసార్లు అరెస్టయ్యారు. సొంత పార్టీ నేతల నుండి కిరణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కిరణ్, డిజిపి వైఖరిపై నిప్పులు చెరిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఓ అడుగు ముందుకేసి... తెలంగాణవాదులను రెచ్చగొడితే తాము పదవులను త్యజించడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. మధ్యాహ్నం అనుకున్న సమయానికి ఆయా పార్టీలు, ప్రజా సంఘాల ర్యాలీలు నిర్దేషిత ప్రాంతాల నుండి ప్రారంభమయ్యాయి. పోలీసులు ర్యాలీలను ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. పోలీసులు, తెలంగాణవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణవాదులు బారీకేడ్లు తొలగించి, ముళ్లకంచెలు పెకిలించి వేదిక వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణవాదులు కూడా పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీడియా ఓబి వ్యాన్లకు, నెక్లెస్ రైల్వే స్టేషన్‌కు, రెండు పోలీసు జీపులకు నిప్పు అంటించారు. సాయంత్రం కవాతు వేదిక వద్దకు వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తదితరులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులపై తెలంగాణవాదులదే పైచేయి అయింది. ఎక్కడికి అక్కడ పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కాలు కాలు కదిపి కదం తొక్కారు. డిజిపి దినేష్ రెడ్డి నగరంలో ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. తూటాలకు వెన్నుచూపని ఓయు విద్యార్థులు! కవాతు నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రణరంగమైంది. ఓయు విద్యార్థులు బైక్ ర్యాలీతో కవాతు వేదిక వద్దకు బయలుదేరారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకొని ముందుకు కదలనివ్వలేదు. తాము బైక్ ర్యాలీతోనే వెళ్తామని విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులు కూడా అంతే ధీటుగా పోలీసుల పైకి రాళ్ల వర్షం కురిపించారు. శాంతియుతంగా కవాతు చేస్తామని.. అనుమతిస్తే మంచిదని లేకుంటే తాము అదే తీరుగా స్పందిస్తామని పోలీసులు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ విద్యార్థికి రబ్బరు తూటా తగిలి గాయమైంది. తూటా తగిలినా, బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ విద్యార్థులు వెనుకంజ వేయలేదు. నెక్లెస్ రెడ్డు తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతరను తలపించింది.